అలరించిన ఏకశిల సౌందర్యం

27 Jan, 2021 03:47 IST|Sakshi
ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటం

న్యూఢిల్లీలో ఏపీ శకటం 

ఏపీ భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

సాక్షి, న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య తోరణాలు, భిన్న కళాకృతులతో కూడినస్తంభాలు, కళాకారుల ఏకవీర నాట్యం, అతిపెద్ద ఏకశిల నందితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ శకట సౌందర్యం గణతంత్ర వేడుకల ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. న్యూడిల్లీలో మంగళవారం గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రదర్శించారు. భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటంలో 12 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తుతో ఉన్న నంది ముందుభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలించింది. నంది వెనుక ఆలయ ముఖ మండపం, అర్ధ మండపం నమూనాలు ఏర్పాటు చేశారు.

లేపాక్షి శిల్పకళలో ప్రతి స్తంభానికి ఉండే ఓ విశిష్ట శైలిని కళ్లకు కట్టినట్లుగా భిన్న కళాకృతులతో ఏర్పాటు చేశారు. శివలింగంపై ఏకశిల శోభితమైన ఏడుతలల పామును వెనక భాగంలో ప్రదర్శించారు. ఇరువైపులా వినాయకుడు, గర్భగృహానికి ముందుగా వీరభద్రుడి కుడ్యచిత్రం శకటానికి మరింత అందం తీసుకొచ్చింది. శకటంపైన, ఇరువైపులా నడుస్తూ.. వీరభద్రుడిని శ్లాఘిస్తూ సంప్రదాయ వీరనాట్యం ప్రదర్శించారు. 15వ శతాబ్దం నాటి శిల్పకళా సౌందర్యాన్ని కనులారా వీక్షించిన ఆహూతులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

శకటం రాజ్‌పథ్‌లో సాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సమాచారశాఖ సంయుక్త సంచాలకుడు కిరణ్‌కుమార్‌ శకట ప్రదర్శనను పర్యవేక్షించారు. మరోవైపు ఏపీ భవన్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అభయ్‌త్రిపాఠి జాతీయ జెండాను ఎగురవేశారు. రెసిడెంట్‌ కమిషనర్‌ భావనాసక్సేనా గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు.   

మరిన్ని వార్తలు