గణతంత్ర వేడుకల రిహార్సల్స్‌

26 Jan, 2021 06:07 IST|Sakshi
రిహార్సల్స్‌ నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది

నేడు మున్సిపల్‌ స్టేడియంలో వేడుకలు 

హాజరుకానున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విజయవాడ మున్సిపల్‌ స్టేడియం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మువ్వన్నెల కాంతులతో మున్సిపల్‌ స్టేడియం మెరిసిపోతోంది. మంగళవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా నిర్వహించే పోలీసు కవాతుకు సంబంధించిన ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ను సోమవారం డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తులు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, మంత్రులు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై డీజీపీ సవాంగ్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రముఖుల భద్రత, కోవిడ్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమీక్షించారు. వేడుకల ప్రారంభం నుంచి ముగింపు వరకు నిర్ణయించిన కాల వ్యవధికి అనుగుణంగానే రిహార్సల్స్‌ చేశారు. 

9 గంటలకు ఆరంభం 
మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం ఉదయం 9 గంటలకు గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొని తొలుత పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం పోలీసు కవాతు, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరించేలా పలు శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. ఉత్తమ శకటాలకు అవార్డులు అందిస్తారు. అనంతరం ఉదయం 10.07 గంటలకు జాతీయ గీతం ఆలాపనతో వేడుకలను ముగిస్తారు. 

ఉత్సవాలకు రూ.53.50 లక్షలు 
రిపబ్లిక్‌ డే ఉత్సవాల నిర్వహణకు రూ.53.50 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమాలకు ఈ నిధుల్ని ఖర్చు చేసేందుకు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి 
కృష్ణబాబు జీవో జారీ చేశారు.    

మరిన్ని వార్తలు