భూకంప బాధితుల రక్షణకు రెస్క్యూ ఆపరేషన్‌

9 Feb, 2022 04:31 IST|Sakshi
మాక్‌ డ్రిల్‌లో.. కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడుతున్న రెస్క్యూ టీమ్‌

కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌ డ్రిల్‌ 

గన్నవరం రూరల్‌/సాక్షి, అమరావతి: ‘అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. భూకంపంతో భవనం కుప్పకూలింది.. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు సమాచారం అందించడంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది’.. ఏంటి ఇదంతా వాస్తవం అనుకుంటున్నారా? కాదు.. కేవలం మాక్‌ డ్రిల్‌ మాత్రమే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ను మంగళవారం ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ సందర్శించారు. అనంతరం భూకంపం సంభవించినప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ స్పందించే విధానం, హైరిస్క్‌ భవనాల్లో చిక్కుకున్న బాధితులను రెస్క్యూ రోప్‌ టీమ్‌ రక్షించే విధానాలపై ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన వీక్షించారు. 

మాక్‌ డ్రిల్‌ ఇలా: మాక్‌ డ్రిల్‌లో భాగంగా.. భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన రెస్క్యూ టీమ్‌ భవనం స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ సాయంతో గ్యాస్, కరెంట్‌ సరఫరాను నిలిపివేసింది. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌ శిథిలాల కింద ఉన్న బాధితులను గుర్తించగా యంత్రాలతో గోడలు బద్దలుకొట్టి వారిని రక్షించింది. అనంతరం బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రోప్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. పై అంతస్తుల్లో ఉన్నవారి నడుముకు బెల్టులు అమర్చి రోప్‌ సహాయంతో వారిని సురక్షితంగా కిందకు చేర్చింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది.  బెటాలియన్‌ కమాండెంట్‌ జాహిద్‌ ఖాన్, డిప్యూటీ కమాండెంట్‌లు జఫరిల్‌ ఇస్లాం, దిల్‌భాగ్‌ సింగ్, సుఖేందు దత్త, అఖిలేష్‌ చౌబే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్‌లు నిర్వహించారు.

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం..
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరం సహాయ చర్యలు చేపట్టేందుకు దేశంలో 26 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లు 12 ఉండగా వాటిని 16కు పెంచాం. విపత్తుల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను బెటాలియన్లలో అందిస్తున్నాం. భవిష్యత్‌ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం.
– అతుల్‌ కర్వాల్, డీజీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌  

మరిన్ని వార్తలు