నది మధ్యలో మూడు రోజులు.. మృత్యువును జయించి..

13 Aug, 2021 08:04 IST|Sakshi
పెన్నా నది మధ్యలో చిక్కుకున్న వృద్ధురాలిని బయటకు తీసుకుని వస్తున్న ఎస్‌ఐ కల్పన, ఈతగాళ్లు   

ప్రవాహంలో కొట్టుకుపోయిన వృద్ధురాలు 

మృత్యువును జయించి మూడు రోజుల తర్వాత ఒడ్డుకు 

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన 

వల్లూరు: వంతెనపై నడిచివెళ్తున్న వృద్ధురాలు అనుకోకుండా పెన్నా నదిలో పడిపోయి ప్రవాహంలో సుమారు 5 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. ధైర్యాన్ని కూడగట్టుకుని నది మధ్యలో గల ఇసుక గుట్టలపైకి చేరింది. మూడు రోజులపాటు ఆ గుట్టలపైనే ఉండిపోయిన ఆమె స్థానికులు, పోలీసుల చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం గంగవరానికి చెందిన పుత్తా రుక్మిణమ్మ (65) భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. సంతానం లేని ఆమె అప్పటినుంచి గంగవరంలోని తన సోదరుని ఇంట్లో  ఉంటోంది.

సోమవారం రాత్రి భోజనానంతరం ఇంటినుంచి బయటకు వెళ్లిన రుక్మిణమ్మ గ్రామ సమీపంలో కమలాపురం–ఖాజీపేట మండలాల సరిహద్దున గల వంతెన పైనుంచి పెన్నా నదిలో పడిపోయింది. అక్కడి నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు లోతట్టున చెరువుకిందిపల్లె సమీపంలో నది మధ్యన గల ఇసుక గుట్టలపైకి చేరింది. గురువారం నీటి ప్రవాహం మధ్య ఇసుక గుట్టలపై ఎవరో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్‌ఐ కల్పన అక్కడకు చేరుకుని పుష్పగిరి నుంచి ఈతగాళ్లను రప్పించి ట్యూబుల సహాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆమెకు పీహెచ్‌సీలో వైద్యం చేయించి బంధువులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు