చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

31 Mar, 2022 04:27 IST|Sakshi
ప్రధాని మోదీతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి, సుభాష్‌చంద్రబోస్‌

న్యాయ వ్యవస్థలోను అమలు చేయాలి..

బీసీ జనగణన చేపట్టాలి  

ప్రధానికి వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే..  

► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు.  మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా  గుర్తింపు రాలేదని తెలిపాం.  
► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం.  

మరిన్ని వార్తలు