కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం

4 Oct, 2021 07:02 IST|Sakshi
విశాఖ క్యాంపులో ఉన్న కార్పొరేటర్లు  

క్యాంపులో 33 మంది కార్పొరేటర్లు

అచ్చెన్నాయుడును కలిసిన మరో వర్గం

సాక్షి, కాకినాడ: నగర మేయర్‌ సుంకర పావనిపై పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పావని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమకు విలువ ఇవ్వలేదని, మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కార్పొరేటర్లు గత నెల 17న కలెక్టర్‌ హరికిరణ్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన 33 మంది కార్పొరేటర్లు విశాఖలో ఏర్పాటు చేసిన రాజకీయ శిబిరానికి తరలి వెళ్లారు. వీరిలో చాలామంది కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు. వీరందరూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి కాకినాడ చేరుకుని ఓటింగ్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే మేయర్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి కార్పొరేటర్లతో పాటు సొంత టీడీపీకి చెందిన మిగిలిన తొమ్మిది మంది కూడా ఆమెకు దూరమయ్యారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను కూడా ధిక్కరించేందుకు వారు సమాయత్తమవుతున్నారని సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడును రెండు రోజుల క్రితం ఈ తొమ్మిది మంది కార్పొరేటర్లూ నేరుగా కలిసి తమ వాదన వినిపించినట్టు చెబుతున్నారు. 

మేయర్‌ పావని సొంత పార్టీలోని కార్పొరేటర్లను కూడా పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేమని చెప్పారని అంటున్నారు. ఓవైపు అసమ్మతి కార్పొరేటర్లు, మరోవైపు సొంత పార్టీలోని కార్పొరేటర్ల నుంచి కూడా అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో మేయర్‌ ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం జరగనున్న ఓటింగ్‌పై పడింది. 

మరిన్ని వార్తలు