గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత

16 Jan, 2021 05:13 IST|Sakshi

విధివిధానాలు రూపొందించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం 

సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీధి దీపాల నిర్వహణ బాధ్యతను గ్రామ సచివాలయాల చేతుల్లో పెట్టాలని యోచిస్తోంది. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే వెలిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. సచివాలయ కార్యదర్శిని పర్యవేక్షకుడిగా నియమించనుంది. ఈ దిశగా విధివిధానాలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.  

► పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.   
► ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్ల తోడ్పాటు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎనర్జీ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను నియమించుకోవచ్చు.  
► కొత్త వ్యవస్థలో భాగంగా డెస్‌్కటాప్, మొబైల్‌ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేయడంతో పాటు టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.  
► గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి లైట్లు అమర్చడం వల్ల దీర్ఘకాలికంగా రూ.156 కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా చేయవచ్చు. 

మరిన్ని వార్తలు