AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే

7 May, 2022 08:00 IST|Sakshi

ఇప్పటికే 513 గ్రామాల్లో నంబర్‌ 13 నోటిఫికేషన్‌ జారీ

త్వరలో మరో 598 గ్రామాల్లో జారీకి సన్నాహాలు

8,933 వినతుల్ని పరిష్కరించిన సర్వే బృందాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం కావడంతో మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో మొదటి విడత 650 గ్రామాలు, రెండో విడత 384 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 513 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్‌–13 నోటిఫికేషన్లు కూడా ఈ గ్రామాల్లో జారీ చేశారు. మిగిలిన 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తక్కువ గ్రామాల్లో సర్వే పూర్తయింది. మలి దశలో ఈ జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 1,854 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయింది. అందులో 1,142 గ్రామాల డ్రోన్‌ చిత్రాలు (ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ –ఓఆర్‌ఐ)లు రెవెన్యూ బృందాలకు చేరాయి. మిగిలినవి కూడా అందగానే ఆ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేస్తామని సర్వే సెటిల్మెంట్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ తెలిపారు. రీసర్వే అనుకున్న దానికంటె వేగంగా జరుగుతోందని చెప్పారు. 3 నెలల్లోనే 1034 గ్రామాల్లో సర్వేను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సాధ్యమైనంత వరకు సర్వే బృందాలే పరిష్కరిస్తున్నాయి. చాలా తక్కువ సంఖ్యలోనే అభ్యంతరాలు తహశీల్దార్‌ వరకు వెళుతున్నాయి. 9,278 అభ్యంతరాలు రాగా 8,933 అభ్యంతరాలను సర్వే బృందాలు పరిష్కరించాయి.  

మరిన్ని వార్తలు