పేదల పాలిట పెన్నిధి సీఎం జగన్‌ 

30 Jun, 2021 04:44 IST|Sakshi

ఎల్లో మీడియా పిచ్చి పోకడలపై న్యాయ పోరాటం చేయాలి 

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి 

గుంటూరు (ఎడ్యుకేషన్‌): అభివృద్ధికి దూరమైన అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఆర్థిక వనరులను సమకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పాలిట పెన్నిధిగా నిలిచారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎ.ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో గల అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్, వైఎస్సార్‌ ఇంటెలెక్చ్యువల్‌ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం’ వేదికపై ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–అభివృద్ధి–శాంతి భద్రతలు’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పాలనా ఫలితాలను రుచి చూపించి, సంక్షేమ రాజ్య స్థాపనకు డాక్టర్‌ వైఎస్సార్‌ పునాదులు వేయగా.. ఆయన తనయుడు రెండు అడుగులు ముందుకు వేసి సుపరిపాలన దిశగా రెండేళ్ల ప్రస్థానంలో అభివృద్ధికి ఆకృతి ఇవ్వడం అద్భుతమన్నారు. సంఘ విద్రోహుల పాలిట సింహస్వప్నంగా దిశ చట్టంతో రాష్ట్రంలో శాంతిభద్రతల దశ మార్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని అన్నారు. అభివృద్ధికి దూరంగా మగ్గుతున్న వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన ఆదాయ, ఆరోగ్య, ఆవాసాలను అతి తక్కువ కాలంలోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు.  

ఎల్లో మీడియా పిచ్చిపోకడలపై న్యాయ పోరాటం చేయాలి 
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనికీ అడ్డుపడుతున్న ఎల్లో మీడియా పిచ్చి పోకడలపై డాక్టర్‌ కారుమంచి రవి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పత్రికలు, మాధ్యమాలు పాత్రికేయ ధర్మానికి తిలోదకాలిచ్చి ఫ్యాక్చువల్‌ ఎర్రర్స్‌ (వాస్తవ విరుద్ధాల)ను ప్రచురించి ప్రజా ప్రయోజనాలను, ప్రభుత్వ విధానాలను పక్కదోవ పట్టిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విష ప్రచారం చేస్తున్న పత్రికల విశ్వసనీయతను అవకాశమున్న ప్రతి వేదిక ద్వారా దెబ్బతీయాలని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు వైఎస్‌ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలకు నిర్ణీత కాల వ్యవధి, ప్రభుత్వమే లబ్ధిదారులతో నేరుగా సంప్రదించడం, కాల్‌ సెంటర్‌ సేవలను విస్తృతపర్చడం ద్వారా అవినీతి నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణంపై వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశారు.  

మరిన్ని వార్తలు