ప్రకాశం జిల్లాలో అత్యధికం.. వైఎస్సార్‌ జిల్లాలో అత్యల్పం

30 Aug, 2021 04:24 IST|Sakshi

రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పొగరాయుళ్లు 28.2 %

వైఎస్సార్‌ జిల్లాలో అత్యల్పంగా 18 % 

ఏపీలో 3.8 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు 

ఈశాన్య రాష్ట్రాల్లో వ్యసనపరులు చాలా ఎక్కువ 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి     

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు పైబడిన వారిలో  22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే పేర్కొంది. పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది.

పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ పీలుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది.  

ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికం.. 
దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది.

తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్‌లో 48.8 శాతం,  గుజరాత్‌లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే పేర్కొంది.   

మరిన్ని వార్తలు