వెబ్‌ ల్యాండ్‌ దోపిడి.. వేల ఎకరాలను కాజేసిన వైనం

6 Oct, 2021 09:06 IST|Sakshi

రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియలో లొసుగులు 

కిరణ్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన విధానంలో అనేక లోపాలు 

ఆన్‌లైన్‌ నమోదులో అక్రమాలకు పాల్పడిన మాజీ వీఆర్‌ఓ మోహన్‌గణేష్‌ పిళ్లై  

భూకుంభకోణంలో కలెక్టరేట్‌ సిబ్బంది పాత్రపై అనుమానాలు

మాజీ వీఆర్‌ఓ మోహన్‌గణేష్‌ పిళ్లై భూ దోపిడీ రెవెన్యూశాఖలోని లొసుగులను బట్టబయలు చేసింది. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడంలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. రికార్డుల డిజిటలైజేషన్‌ పేరుతో ప్రారంభించిన వెబ్‌ ల్యాండ్‌ విధానమే అక్రమాలకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఈ కొత్త పద్ధతి మొదలవడంతో అప్పనంగా భూకబ్జాలకు పాల్పడేందుకు పిళ్లైకు అవకాశం చిక్కింది. తన భూబాగోతాన్ని ఎవరూ కనిపెట్టలేరనే నమ్మకంతోనే యథేచ్ఛగా దందా సాగించినట్లు వెల్లడవుతోంది. కలెక్టరేట్‌ సిబ్బంది ప్రమేయం లేకుండా భారీస్థాయిలో వెబ్‌ల్యాండ్‌ నమోదు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. 

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌: కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయిందన్నట్లు తయారైంది వెబ్‌ ల్యాండ్‌ పరిస్థితి. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ పేరుతో కిరణ్‌ సర్కార్‌ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇదే మాజీ వీఆర్‌ఓ మోహన్‌గణేష్‌ పిళ్లైకు వరంగా మారింది. తప్పుడు పత్రాలను సృష్టించి వాటిని డిజిటలైజేషన్‌లో భాగంగా రికార్డుల్లో నమోదు చేయించాడు.  2010లో పిళ్లై ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఆయా భూములను నొక్కేశాడు. జిల్లాలోని 13 మండలాలు.. 18 గ్రామాల పరిధిలో సుమారు 2,320 ఎకరాల భూకుంభకోణం 11 ఏళ్ల తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిందితులైన మోహన్‌గణేష్‌ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్ట్‌ చేశారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఇలాంటి ఘటనలు మరిన్ని బయటపడే అవకాశముందని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోగస్‌ పట్టాలతో వేల ఎకరాలను వెబ్‌ల్యాండ్‌కు ఎక్కించారంటే అందులో కలెక్టరేట్‌ సిబ్బంది పాత్ర కచ్చితంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


వెబ్‌ల్యాండ్‌ నమోదుకు వినియోగించిన నకిలీ పత్రాలు  

తప్పుల తడకగా రెవెన్యూ రికార్డులు 
వెబ్‌ల్యాండ్‌ రాకముందు రికార్డులన్నీ మాన్యువల్‌గానే నిర్వహించారు. అడంగళ్, 1(బి), ఆర్‌ఎస్‌ఆర్‌ వంటివి రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఉండేవి. ఈ రికార్డులను డిజిటలైజ్‌ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా వెబ్‌ల్యాండ్‌ను రూపొందించారు. అయితే వీఆర్‌ఓల చేతుల మీదుగా ప్రక్రియ మొత్తం కొనసాగడంతో అప్పడు విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌గణేష్‌ పిళ్లై మోసాలకు పాల్పడ్డాడు. దీనికితోడు వెబ్‌ల్యాండ్‌  ప్రక్రియను పర్యవేక్షించిన అప్పటి జాయింట్‌ కలెక్టర్లు సురేష్‌కుమార్, ప్రద్యుమ్న అలసత్వం కూడా సదరు మోహన్‌గణేష్‌ పిళ్లైకు అవకాశంగా మారింది.   

చదవండి: (చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం.. రూ.500 కోట్లు..!)

అందుకే భూముల రీసర్వే 
భూ సమస్యల కారణంగా నిత్యం వందలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యలకు చరమగీతం పాడేందుకు రీసర్వేను పకడ్బందీగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రీసర్వే వేగవంతంగా జరుగుతోంది. దీంతో భూ సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పడనుంది.

రెవెన్యూ రికార్డులు పరిశీలించండి: తహసీల్దార్‌ 
యాదమరి: మండలంలోని 184 గొల్లపల్లె మాజీ వీఆర్‌ఓ మోహన్‌గణేష్‌ పిళ్లై అక్రమాలను పూర్తిస్థాయిలో బయటపెట్టేందుకు రికార్డులను పకడ్బందీగా పరిశీలించాలని తహసీల్దార్‌ చిట్టిబాబు ఆదేశించారు. బోదగుట్టపల్లె రెవెన్యూ పరిధిలో పిళ్లై 200 ఎకరాలకు పైగా కాజేసినట్లు సమాచారం అందిందన్నారు. ముఖ్యంగా కొటాల, నడింపల్లె, వరదరాజులపల్లె, యాదమరి, దాసరాపల్లె, ఓటివారిపల్లె గ్రామాల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి పరుల పాలైనట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం వాస్తవాలు తెలుస్తాయని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు