తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది

15 Jul, 2021 11:33 IST|Sakshi
చేబ్రోలు తహసీల్దారు కార్యాలయం

సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.  

‘సాక్షి’ కథనంతో వెలుగులోకి 
ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్‌ను సస్పెండ్‌ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్‌ మహిళా వలంటీర్‌ని రాత్రి సమయంలో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్‌లైన్‌ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తహసీల్దారును సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్‌ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్‌ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్‌ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.  

ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... 
చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్‌ఐ, వీఆర్వో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ల సహకారంతో సస్పెండ్‌ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది.   

చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్‌ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్‌ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్‌ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.  

ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. 
చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.

నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు