సమావేశాలు ముగిసేలోగానే సమాధానాలివ్వండి

6 Mar, 2022 05:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అన్ని శాఖల కార్యదర్శులకు శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ ఆదేశం

సభ్యులడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అందజేయాలని సూచన

అసెంబ్లీ, మండలి సమావేశాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష    

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తయ్యేలోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కమిటీ హాల్‌లో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్‌ అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ సమీక్షించారు.

ఆ ప్రశ్నలే ఎక్కువ పెండింగ్‌
శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. గత సమావేశాల్లో మండలి సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబంధించినవే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పలు వినూత్న సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వాటిని సుస్పష్టంగా వివరిస్తూ సరైన సమాధానాలను సభ్యులకు అందజేయాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి సూచించారు. మాజీ ఎమ్మెల్సీల మెడికల్‌ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలకు వారు నివశించే ప్రాంతాల్లోనే మందులు అందజేసే అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు.  బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి పలు సూచనలు చేశారు.

ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమివ్వాలి
శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మాట్లాడుతూ.. ప్రజల దృష్టంతా ఈ నెల 7 నుంచి జరిగే శాసన సభ సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని అన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ సమావేశాలు ముగిసేలోపు తప్పక ఇవ్వాలని అన్నిశాఖల కార్యదర్శులను కోరారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న దృష్ట్యా అన్నివైపులా పటిష్టమైన బందోబస్తు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమై నిఘా ఏర్పాట్లు చేయాలని డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలు, డిప్యూటీ సెక్రటరీ ఎం.విజయరాజు, శాసన మండలి ఓఎస్‌డీ కె.సత్యనారాయణరావు, పలు శాఖల  ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు