‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్‌  

25 Apr, 2021 08:14 IST|Sakshi

సచివాలయాల ఏర్పాటుతో గ్రామస్థాయి పాలనలో విప్లవాత్మక మార్పులు

545 రకాల ప్రభుత్వ సేవలు కుగ్రామాల్లో సైతం అందుబాటులోకి..

పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో సరిపడినన్ని నిధులు

సాక్షి, అమరావతి: గతంలో నిరుపేద అవ్వకు పెన్షన్‌ కావాలన్నా.. కూలీనాలీ చేసుకుంటే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబానికి రేషన్‌ కార్డు కావాలన్నా.. రైతు తన వ్యవసాయ భూమి వివరాలు పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలో నమోదు చేయించుకోవాలన్నా.. అధికారులు లేదా రాజకీయ నాయకుల చుట్టూ రోజుల తరబడి తిరిగితే గాని పనులు జరగని పరిస్థితి. ఒక్కొక్కసారి రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు పెట్టినా పని పూర్తికాక ఇబ్బందులు పడిన వారున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే చాలు.. చిన్న కష్టం కూడా పడకుండా దరఖాస్తు చేసుకుంటే.. రేషన్‌ కార్డు, పింఛన్లు, మంజూరు పత్రాలను వలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారులు ఎవరన్నది గ్రామస్తులందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించాకే లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తున్నారు. అవ్వాతాతలకు ప్రతి నెలా 1నే పింఛను డబ్బులు వలంటీర్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్‌ సరుకులు సైతం ప్రతి ఒక్కరికీ ఇంటివద్దే అందుతున్నాయి. ఈ సేవలు అందించడం వల్లే కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా ఏపీ 17 జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది.

కోటిన్నరకు పైగా సమస్యల పరిష్కారం 
ఒకప్పుడు గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శి కూడా ఉండే వారు కాదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ఇప్పుడు కనీసం 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ సేవలందిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ వంటివి 70 వేలకు పైబడి భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి. ప్రతి గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. కుగ్రామంలో ఉండే గ్రామ సచివాలయంలోనూ డిజిటల్‌ లావాదేవీలు కొనసాగుతున్నాయి.

సచివాలయాల ఏర్పాటు తర్వాత 2020 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 2.18 కోట్లు వినతులందగా.. 2.11 కోట్ల వినతులను అధికారులు పరిష్కరించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1.62 కోట్ల వినతులకు గానూ, 1.57కోట్ల వినతులను పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ఏ పని ఉన్నా ఆ ఊరిలోనే పరిష్కరించేలా గ్రామ సచివాలయాల్లో 545 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నిధులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,625 కోట్లను 70–15–15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో రూ.1,939 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి.
చదవండి: రికవరీలో ఏపీ బెస్ట్‌    
ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు

మరిన్ని వార్తలు