2 Years Of YS Jagan Rule In AP: ఆచరణలో 'అందరివాడు'

30 May, 2021 03:11 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలనలో విప్లవాత్మక ప్రగతి 

అన్ని వర్గాల్లోని అర్హులైన పేదలకు నేరుగా నగదు సాయం 

ఆర్థికంగా, సామాజికంగా బలోపేతానికి చర్యలు 

ఇప్పటికే 95 శాతం పైగా హామీల అమలు  

కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు 

కరోనా విపత్తులో సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేయూత  

ఇదివరకెన్నడూ లేని విధంగా యువతకు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు 

చేతులు కలిస్తే చప్పట్లు. చేతులు జోడిస్తే దండాలు. ఒక నాయకుడి పరిపాలనలో ఇవి రెండూ ప్రస్ఫుటమవుతూ ఉంటే అభివృద్ధికి చిహ్నమదే. సంతోషానికి సంకేతమదే!!. రెండేళ్లుగా  వీటినే గీటురాళ్లు చేసుకుని ముందుకెళుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఫలితం... అక్షరలక్షలను అందించే సర్కారీ స్కూళ్లు రూపు మార్చుకుంటున్నాయి. ఆరోగ్యానికి దిక్సూచులైన ప్రభుత్వాసుపత్రులు బాగుపడుతున్నాయి. నాణ్యమైన చదువు... ఆధునిక వైద్యం పేదల దరికి చేరాయి. ఊరూరా వెలసిన సచివాలయాలు అక్కడికక్కడే అధికారిక అవసరాలు తీరుస్తున్నాయి.

ఇక నాణ్యమైన విత్తును అందించటం నుంచి... పండించిన పంటను విక్రయించుకోవటం వరకూ భూమిపుత్రులకు ఆర్బీకేలే వేదికలు. వాడవాడకూ పెట్టిన వలంటీర్లంటే స్థానికులందరికీ తలలో నాలుకలే. నెలనెలా 1వ తేదీన ఠంచన్‌గా పింఛనందించటమే కాదు.. ప్రభుత్వ పథకాలకు, లబ్ధిదారులకు మధ్య వారధులు వీరే. ఇవన్నీ ఒకెత్తయితే పాలనలో పారదర్శకత మరోఎత్తు. ఏ పథకానికైనా... ఎవరైనా... ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైతే చాలు. వారి పేర్లు నేరుగా గ్రామ సచివాలయాల్లోనే దర్శనమిస్తాయి. ఒక్క క్లిక్‌తో డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకే వస్తాయి. వీటితో పాటు కీలకమైన టెండర్లన్నీ ముందే జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వెళుతున్నాయి. ఇదీ.. దాపరికం లేని పాలనంటే. ప్రజల తలపుల నుంచి చెరిగిపోతున్న విపక్షాలు... ఎన్ని విమర్శలయినా చేయొచ్చు.

ఎన్ని కుట్రలయినా పన్నొచ్చు. కానీ ఒక అన్నలా.. బిడ్డలా.. మేనమామలా.. మనవడిలా.. అన్నిటికీ మించి కుటుంబ పెద్దలా అందరి బాగోగులూ చూస్తూ ముందుకెళుతున్న సీఎంకు... తన ఎన్నికల మేనిఫెస్టోయే మార్గదర్శి.  అదే ఓ ఖురాన్‌... బైబిల్‌... భగవద్గీత. మేనిఫెస్టోను ఎన్నికలు దగ్గరికొచ్చినపుడు మాత్రమే గుర్తుచేసుకునే రాజకీయాలను ఆయన మార్చేశారు. ముఖ్యమంత్రయిన మరుక్షణం నుంచే మనసా వాచా అమలు చేశారు. ఎంతటి కష్టకాలమైనా వెనకడుగు ప్రసక్తే లేదు. సాకుల ఊసే లేదు. ఈ అండదండలకే జనం జేజేలు కొట్టారు. మీ వెంటే ఉన్నామంటూ ప్రతి ఎన్నికల్లోనూ ఆశీర్వదిస్తున్నారు. ఈ నమ్మకానికి... జగనన్న మనస్పూర్తిగా చేతులు జోడిస్తుంటారు.!!  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. అంటూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ‘వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌. మేనిఫెస్టోలో ఏమి చెప్పామో, వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయం.. ఇవేవీ చూడకుండా అర్హులందరినీ ఆదుకోవడమే మనందరి ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు. ఇప్పటి వరకు అదే బాటలో పయనిస్తూ, విప్లవాత్మక నిర్ణయాలతో, పథకాలతో అఖిలాంధ్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సమ సమాజ స్థాపనే లక్ష్యం అనే మాటలు ఇప్పటి వరకు పాలకుల నోట విన్నాం తప్ప.. ఆచరణలో చూడటం ఇదే ప్రథమం.

పేదలు, సామాన్యులు సగర్వంగా జీవనం సాగించేలా వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలన సాగింది. సంపద ఏ కొద్ది మంది చేతుల్లోనో ఉంటే ఎప్పటికీ  సమ సమాజ స్థాపన సాధ్యం కాదని ముఖ్యమంత్రి జగన్‌ గట్టిగా విశ్వసించారు. తన రెండేళ్ల పాలనలో సంపదను బడుగు బలహీన వర్గాలకు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు, భవిష్యత్‌ తరాలకు బాటలు వేసే విద్యార్థులకు, పిల్లలకు, వృద్ధాప్యంలో ఆసరా కోసం చూస్తున్న వారికి.. ఇలా అన్ని వర్గాల్లోని, వృత్తుల్లోని పేదలకు పంచడం ద్వారా సమ సమాజ స్థాపనకు బీజం వేశారు.  

అన్ని వర్గాలకు సమ న్యాయం
► రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా పేదల ఇళ్ల కోసం వేల ఎకరాలను వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి సేకరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదీ ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే. రాజకీయంగా, అధికారిక పదవుల్లో కూడా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించిన ఏకైన ముఖ్యమంత్రి జగన్‌. 

► గత చంద్రబాబు పాలనలో సంపద అనేది ఏ కొద్ది మంది వ్యక్తులకే పరిమితమవ్వడంతో సమాజంలోని అట్టడుగు పేద వర్గాలతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థుల్లో నిరాశ నిస్పృహలు వెల్లు వెత్తాయి. దీంతో ఆయా వర్గాలు ఆందోళనలకు దిగారు. 

► రెండేళ్లుగా రాష్ట్రంలో అలాంటి అవకాశమే లేదు. కోవిడ్‌–19 కష్ట కాలంలో కూడా నవరత్నాల ద్వారా ప్రభుత్వ సంపదను సమాజంలోని అర్హులైన అన్ని వర్గాలకు నేరుగా చేరవేయడంతో ఏ వర్గంలోనూ ఆందోళన అనేది మచ్చుకు కూడా కనిపించలేదు. 

► రాష్ట్రంలోని ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయంగానూ పదవులను ఇచ్చారు. ఇందుకోసం ఏకంగా చట్టాలను చేశారు. పదవులతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నామినేషన్‌ పనుల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశారు. ముఖ్యంగా సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు అన్నింటా సమాన అవకాశాలు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేశారు. 

విశ్వసనీయతకు మారు పేరు
► తన రెండేళ్ల పాలన ద్వారా విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచారు సీఎం వైఎస్‌ జగన్‌. మాట తప్పని, మడమ తిప్పని నేతగా రెండేళ్ల పాలనలోనే ఆచరణలో నిరూపించారు. ప్రజలు ఐదేళ్లకు కదా ఓటు వేసింది.. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం ఎందుకనే గత పాలకుని వైఖరికి భిన్నంగా నవరత్నాల ద్వారా ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతంపైగా ఇప్పటికే అమలు చేశారు.

► రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులో ముంచేయడమే కాకుండా దాదాపు 42 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయిలను పెట్టి చంద్రబాబు సర్కారు దిగిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జగన్‌.. ఎన్నికల ప్రణాళికే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అని భావించారు.

► ఈ రెండేళ్లలో నవరత్నాల ద్వారా 6.5 కోట్ల మందికి (కొందరికి ఒకటి కంటే ఎక్కువ పథకాల వల్ల లబ్ధి) వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.95,528.50 కోట్లు నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 2.36 కోట్ల మందికి రూ.36,197.05 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారు. 

కరోనా విపత్తులో ప్రజలకు భరోసా
► సీఎం జగన్‌ నోట ఏనాడూ కూడా పథకాల అమలుకు డబ్బుల్లేవు.. అనే మాట రాలేదు. కరోనా విపత్తుతో లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆదాయ వనరులు తగ్గిపోయినప్పటికీ నవరత్నాలను అమలు చేయడం గమనార్హం. వరుసగా మూడో ఏడాదిలో ఏ పథకం ఏ నెలలో అమలు చేసేది ముందుగానే సంక్షేమ క్యాలండర్‌ను ప్రకటించారు.  

► రాష్ట్ర జనాభాలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా 95 శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. కోవిడ్‌–19, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలను వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీలోకి చేర్చడం ద్వారా లక్షకు పైగా పేద, సామాన్యులకు కోవిడ్‌ చికిత్సను ఉచితంగా అందించారు. 

► ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా సాయం చేశారు.  

గ్రామ స్వరాజ్యం ఆవిష్కరణ
► సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల కాలంలోనే అతి వేగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చి గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని కళ్ల ముందు చూపించారు. ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన, పథకాలు అందించడానికి ఏకంగా 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. 

► గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. తద్వారా ప్రజలకు ఇప్పటి వరకు 2.32 కోట్ల వినతులు పరిష్కరించారు. 

► మద్య నియంత్రణలో భాగంగా 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించడమే కాకుండా బెల్టు షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించారు. షాక్‌ కొట్టేలా మద్యం ధరలను పెంచేశారు. మళ్లీ ఇటీవల మరో 13 శాతం దుకాణాలు తగ్గించారు. ఒక పక్క ఆదాయం రాదని తెలిసినప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన మేరకు, పేద అక్కచెల్లెమ్మల బాగు కోసం ముందుకే అడుగులు వేశారు. 

సామాజిక కోణంలో పథకాలు
► జగనన్న అమ్మ ఒడి పథకం, వసతి దీవెన విద్యార్థుల తల్లులే కేంద్రంగా రూపొందించారు.  పేదలు తమ పిల్లలను బడికి పంపించకుండా పనులకు పంపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అమ్మ ఒడి పథకం అమల్లోకి తెచ్చారు. 

► నవరత్నాల్లోని పథకాలు, కార్యక్రమాలన్నీ కూడా సామాజిక, ఆర్థిక కోణంలోనే అమల్లోకి తీసుకువచ్చారని  ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన వైద్య, ఆరోగ్య, విద్యా రంగాన్ని నాడు–నేడు ద్వారా బలోపేతం చేస్తున్నారు. 

► ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, రైతులు, యువత, మహిళలు, కూలీలు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఒక్క అంశం కూడా ప్రతిపక్షం ప్రస్తావించడానికి అవకాశమే లేకుండా ముఖ్యమంత్రి జగన్‌ రెండేళ్ల పాలన సాగింది.  

రూ.1.31 లక్షల కోట్లు పంపిణీ 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటి దాకా మొత్తం 6,53,01,890 మంది లబ్ధిదారులకు (ఒక్కో లబ్ధిదారునికి ఒకటి కంటే ఎక్కువ పథకాలు దక్కాయి) రూ.95,528.50 కోట్లను నేరుగా నగదు బదిలీ చేసింది. నగదేతర పథకాల ద్వారా మొత్తం 2,36,16,150 మంది లబ్ధిదారులకు రూ.36,197.05 కోట్లు పంపిణీ చేసింది. మొత్తంగా నగదు, నగదేతర పథకాల ద్వారా 8,89,18,040 మందికి రూ.1,31,725.55 కోట్లు పంపిణీ చేసింది. 

అవినీతి, లంచాలు లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు
► లబ్ధిదారుల ఎంపికను తొలిసారిగా పారదర్శకంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్‌ నవశకం పేరిట ఇంటింటి సర్వే ద్వారా చేయించారు. ఇంత పెద్ద ఎత్తున డబ్బులను లబ్ధిదారులకు చేర్చినప్పటికీ ఎక్కడా పైసా అవినీతికి ఆస్కారం ఇవ్వకపోవడం ఒక రికార్డు. 

► ప్రతి రోజు మేనిఫెస్టోను చూసుకుంటూ ఏ పథకం ఎప్పుడు అమలు చేయాలి.. వాటికి నిధులు ఎలా సమకూర్చాలనే కసరత్తు స్వయంగా ముఖ్యమంత్రే చేస్తున్నారని, ఆ చిత్తశుద్ధి, పట్టుదల వల్లే మంచి ఫలితాలు వచ్చాయని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. 

మరిన్ని వార్తలు