రైలు బోగీల్లో ఆర్‌ఎఫ్‌ఐడీ పరికరాలు

16 Aug, 2020 04:42 IST|Sakshi

రైళ్ల ట్రాకింగ్, ట్రేసింగ్‌కు ఉపయుక్తం

సరుకు రవాణా రైళ్లలోనూ అమర్చాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: రైల్వే వ్యాగన్లు, కోచ్‌ల ప్రయాణం మొత్తం ట్రాక్‌ చేసేందుకు వీటిలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) పరికరాలను అమర్చనున్నారు. ప్రయాణికుల కోచ్‌లతో పాటు సరుకు రవాణా వ్యాగన్లకు ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను బిగిస్తారు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైళ్ల గమనం మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. దీనివల్ల అవకతవకలు జరుగుతున్నాయని రైల్వే శాఖ అభిప్రాయపడుతోంది. మొత్తం 23 వేల వ్యాగన్లలో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను 2022 డిసెంబర్‌ కల్లా అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల కోచ్‌లలోని రోలింగ్‌ స్టాక్‌లలో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అమరుస్తారు. ఇది ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా వ్యాగన్‌/కోచ్‌ను గుర్తించి సెంట్రల్‌ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది.

► ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ రూపొందిస్తుంది. ఈ ట్యాగ్‌లతో కోచ్‌లు, వ్యాగన్లు, లోకోమోటివ్‌లు ఎక్కడున్నాయో.. ఎక్కడ ప్రయాణిస్తున్నాయో తెలిసిపోతుంది.
► లాక్‌డౌన్‌ సమయంలో దక్షిణ మధ్య రైల్వే 290 ప్రత్యేక పార్శిల్‌ రైళ్ల ద్వారా 40 వేల టన్నుల వరకు సరుకు రవాణా చేశాయి.
► సరుకు రవాణా రైళ్లకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అమరిస్తే మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు