పేదల బియ్యంలో అవినీతి పురుగులు

3 Oct, 2020 09:36 IST|Sakshi

సీఎంఆర్‌గా రేషన్‌ బియ్యం సరఫరా 

రీ సైక్లింగ్‌తో అడ్డగోలు వ్యాపారం

లంచాలతో సివిల్‌ సప్లయిస్‌ అధికారుల కళ్లకు గంతలు

ప్రభుత్వమిచ్చిన సీఎంఆర్‌ ధాన్యంతో రూ.కోట్లకు పడగలు 

జిల్లాలో రైస్‌ మిల్లర్ల అక్రమాలు.. పరాకాష్ట స్థాయికి చేరాయి. ఓ వైపు ధాన్యం కొనుగోలులో ధరలు, తరుగుల పేరుతో రైతుల కడుపులు కొడుతున్న మిల్లర్లు.. మరో వైపు పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేసి సీఎంఆర్‌ పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. సీఎంఆర్‌ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా దర్జాగా మార్కెట్లో విక్రయించి మరో రకంగానూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.

సాక్షి, నెల్లూరు: సివిల్‌ సప్లయిస్, ఎఫ్‌సీఐ అవినీతిని ఆసరాగా చేసుకుని జిల్లాలో రైస్‌ మిల్లర్లు నిరుపేదల కడుపులు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఓ వైపు మోసం చేస్తూ, మరో వైపు రైతులను దోచుకుంటూ, సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చుకుని రూ.కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. జిల్లాలో నెలకు 1.9 లక్షల మెట్రిక్‌ టన్నులు బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంది. మార్చిలో కరోనా తర్వాత కేంద్రం కూడా బియ్యం ఉచితంగా అందిస్తోంది. నెలకు రెండు దఫాలు సరఫరా చేస్తున్నాయి. అంటే దాదాపు 2.18 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. సాధారణంగా రేషన్‌ బియ్యం తక్కువ శాతం వినియోగం ఉంది. దీంతో మిల్లర్లు దళారుల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి సీఎంఆర్‌కు సరఫరా చేస్తున్నారు.  

పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా కేజీ బియ్యం రూపాయికే సరఫరా చేస్తున్నాయి. 
పేదలకు ఇచ్చిన రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లర్లు పలు మార్గాల్లో సేకరించి తిరిగి మిల్లులకు చేర్చి పాలిష్‌ చేసి సీఎంఆర్‌గా మళ్లీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు, భారత ఆహార సంస్థకు సరఫరా చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
జిల్లాలో ఎక్కువగా నెల్లూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైస్‌ మిల్లర్లు దీన్నే వ్యాపారంగా మార్చుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. 
కొంత మంది మిల్లర్లు కనీసం పాలిష్‌ కూడా చేయకుండానే సంచులు మార్చి మళ్లీ పౌర సరఫరాల సంస్థకు అప్పగిస్తున్నట్లు సౌత్‌రాజుపాళెం మిల్లులో వెలుగు చూసిన వాస్తవాలే బట్టబయలు చేస్తున్నాయి.   

ఒక కన్‌సైన్‌మెంట్‌కు రూ.5 లక్షలు ఆదాయం 
పౌర సరఫరాల కార్పొరేషన్‌ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆడించి బియ్యం సరఫరా చేసేందుకు ట్రేడింగ్‌ మిల్లులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఇలా సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)గా మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఇచ్చే మిల్లింగ్‌ చార్జీల ద్వారా ఒక కన్‌సైన్‌మెంట్‌ (220 క్వింటాళ్లు)కు నికరంగా రూ.15 వేలు ఆదాయం ఉంటుంది. కానీ నాణ్యమైన బియ్యం బదులుగా రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ ద్వారా సరఫరా చేస్తే దాదాపు రూ.5 లక్షల వరకు మిగులుతోంది.

జిల్లాలో ట్రేడింగ్‌ కేటగిరీలో 146 రైస్‌ మిల్లులు ఉన్నాయి. అందులో సీఎంఆర్‌ పెండింగ్‌తో 6ఏ కేసులు నమోదైన మిల్లులు మినహాయించి 135 మిల్లులకు ప్రభుత్వం సీఎంఆర్‌ ధాన్యం సరఫరా చేస్తోంది.
ఇందులో దాదాపు అత్యధిక మిల్లులు ప్రభుత్వ సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాయి.
ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు రేషన్‌ బియ్యాన్ని సేకరించి పాలిష్‌ పట్టి సరఫరా చేస్తున్నారు. 
ఇటువంటి బియ్యాన్ని టెస్టింగ్‌ ద్వారా గుర్తించి వాటిని నిరాకరించాలి్సన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్‌ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై దిగుమతి చేసుకుంటున్నారు.
రేషన్‌ బియ్యం కిలో రూ.10లకు కొనుగోలు చేసి పాలిష్‌ పట్టించి, తిరిగి సీఎంఆర్‌గా రూ.27.60లకు విక్రయిస్తున్నారు.  
ఒక్కో రైస్‌మిల్లు ఏడాదికి వందకు పైగా కన్‌సైన్‌మెంట్‌లు సరఫరా చేస్తే దాదాపు రూ.5 కోట్లు మిగులుతున్నట్లు అంచనా.
ఇలా రేషన్‌ బియ్యం సీఎంఆర్‌గా రీసైక్లింగ్‌ జరుగుతుండడంతో ధాన్యం డిమాండ్‌ తగ్గిపోతోంది. దీంతో మిల్లర్లు రైతులను అడ్డుగోలు ధరలకు దోచుకుంటున్నారు. 

విజిలెన్స్‌ దాడుల్లో.. 
జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వేలాది టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడడం సర్వసాధారంగా మారింది. ఇటీవల మర్రిపాడులో రేషన్‌ డీలర్‌ ఇంటి నుంచి దళారులు రేషన్‌ బియ్యం సేకరించి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
కృష్ణపట్నం పోర్టులో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తే ఇతర దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పేదల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలోని రైస్‌మిల్లులో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీల్లో 20 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం 17.5 టన్నుల నూకలు ఉన్నట్లు గుర్తించారు.
నెల్లూరు రూరల్‌ మండలంలోని అల్లీపురం ప్రాంతంలో 20 టన్నుల రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.

నెల్లూరురూరల్‌ మండలం సౌత్‌రాజుపాళెంలోని లక్ష్మీనరసింహ లారీ పార్కింగ్‌ యార్డులో అక్రమంగా నిల్వ చేసిన నిరుపేదలకు పంచాల్సిన చౌక బియ్యం 77 టన్నులు పట్టుబడ్డాయి. సీఎంఆర్‌ లేబుల్‌తో ప్యాక్‌ చేసిన 263 బస్తాలతో పాటు 1,280 బస్తాల చౌక బియ్యం స్టాక్‌ చేసినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.28 లక్షల పైమాటే. ఇటీవల  వెంకటేశ్వరపురం ఎఫ్‌సీఐ గోదాముల్లో భారీస్థాయిలో రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి సీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు