గిరిజనులకు 'పట్టా'భిషేకం

22 May, 2022 05:55 IST|Sakshi

సాగు చేస్తున్న భూములపై అడవి బిడ్డలకు హక్కు   

మూడేళ్లలో 2.47 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌   

అన్ని రాష్ట్రాలకూ ఆదర్శనీయంగా ఆంధ్రప్రదేశ్‌  

ఏపీలో పట్టాల పంపిణీ విధానంపై తెలంగాణ అధ్యయనం 

అటవీ భూముల పంపిణీకి 2008లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌  

సాక్షి, అమరావతి: గిరిపుత్రులకు పట్టాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో 1,33,342 మందికి 2,47,595 ఎకరాల భూమికి ఆర్‌ఓఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ పట్టాల పంపిణీ తీరును అధ్యయనం చేయడం మన రాష్ట్రానికి గర్వకారణం. గతేడాది  తెలంగాణ అధికారుల బృందం మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసి.. నివేదికను తమ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా గిరిజనులకు భూపంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.   

పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన వైఎస్‌ 
స్వాతంత్య్రానికి ముందు నుంచే గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. బ్రిటీష్‌ ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతం అనే పేరుతో 18వ శతాబ్దంలో పోడు వ్యవసాయాన్ని రద్దు చేసింది. పోడు వ్యవసాయం చేసేవారిపై బ్రిటీషు వారు దురాగతాలకు పాల్పడేవారు.

అలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు అల్లూరి సీతారామరాజు అండగా నిలిచారు. స్వాతంత్య్రానంతరం కూడా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల పరిస్థితి మెరుగుపడలేదు. తరతరాలుగా వారు సాగు చేసుకునే అటవీ భూములపై వారికి ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. అటవీ అధికారులు సైతం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులపై కేసులు పెట్టి, పంటలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులకు పట్టాల పంపిణీకి ఉన్న అడ్డంకులు తొలగించి వారికి హక్కు కల్పించేలా వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల కష్టాలను తన పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్సార్‌.. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి 2006లో దేశ వ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు.

ఆ చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు వ్యక్తిగతంగాను, సామూహికంగాను అటవీ భూములపై హక్కు కల్పించే మహోన్నత కార్యక్రమానికి 2008లో వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. అప్పట్లో 56 వేల గిరిజన కుటుంబాలకు 1.30 లక్షల ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో పాటు గిరిజన కుటుంబాలకు సామూహిక సాగు హక్కు పత్రాలనూ అందించారు. 

సీఎం జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం : తెలంగాణ అధికారుల బృందం  
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గిరిజనులు తమకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలివ్వాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. అలాంటిది ఏపీలో అంత పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ ఎలా సాధ్యమైందనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది.

గతేడాది సెప్టెంబర్‌ 18న ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీకి వచ్చి ఇక్కడ గిరిజనులకు పట్టాల పంపిణీ తీరుపై అధ్యయనం చేసింది. ఏపీ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, టి.మహేష్, టి.శ్రీనివాసరావులు సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పథకం ద్వారా భూమి పట్టాలు అందించిన ఆంధ్రప్రదేశ్‌ విధానం.. అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి, తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.  

సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డ్‌ 
వైఎస్సార్‌ చేపట్టిన గిరిజనులకు పట్టాల పంపిణీ మహోన్నత యజ్ఞాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అదే స్థాయిలో కొనసాగించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజనుడికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ద్వారా హక్కు పట్టాలను అందిస్తున్నారు. 2020 అక్టోబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు 1,07,769 మంది గిరిజనులకు 2,08,794 ఎకరాల అటవీ భూములకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేశారు.

మరో 25,573 మంది గిరిజన కుటుంబాలకు 38,801 ఎకరాల భూములకు డీకేటీ పట్టాలను అందించారు. మొత్తంగా 1,33,342 మంది గిరిజనులకు మొత్తం 2,47,595 ఎకరాల భూమికి ఆర్‌ఓఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేయడం విశేషం.   

మార్పు మొదలైంది..  
ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుదార్లకే భూమిపై హక్కు కల్పించడం అంటే గొప్ప సామాజిక మార్పునకు ఊతమిచ్చినట్టే. ఇదే ఆశయంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే.. ఆయన తనయుడిగా సీఎం వైఎస్‌ జగన్‌ మరో రెండు అడుగులు ముందుకేసి మరిన్ని ఎకరాలకు పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు.

పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడంతో వారి జీవితాల్లో మార్పు మొదలైంది. సొంత భూమి ఉండడంతో వారికి ఆత్మవిశ్వాసంతో పాటు సమాజంలో గౌరవం దక్కుతోంది.   
– పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి 

మరిన్ని వార్తలు