సాగర తీరం.. సుందర దృశ్యం 

30 Sep, 2021 03:51 IST|Sakshi

రాష్ట్రంలో 9 బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ సాధనపై ప్రభుత్వం దృష్టి 

సురక్షితంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు 

కేంద్ర బృందం తొలి దశ పరిశీలన పూర్తి 

రిషికొండ బీచ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించి పర్యాటకులకు సమున్నతమైన ఆహ్లాదాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విశాఖలోని రిషికొండ బీచ్‌ ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ పొంది అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోగా.. అదే జాబితాలో మరిన్ని బీచ్‌లను చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ 21 బీచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి అందులో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేసే వీలుగా ఉన్న తొమ్మిదింటిని గుర్తించింది.  

బ్లూ ఫ్లాగ్‌ అంటే..? 
స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లలో పొందవచ్చు. డెన్మార్క్‌కు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌’ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్స్‌ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్‌ పొందిన బీచ్‌లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. వాటిలో అంతర్జాతీయ గుర్తింపునకు చిహ్నంగా నీలం రంగు జెండాను ఎగురవేస్తారు. పర్యాటకుల భద్రత, కాలుష్యరహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత, తీరంలోని ఇసుక వంటి 33 అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటిని బీచ్‌లో కలవకుండా ఉండాలి. బీచ్‌లో సహజ శిలలు కూడా ఉండకూడదు. అలా ఉంటే పర్యాటకులు స్నానాలు చేసే సమయంలో గాయపడే అవకాశం ఉంటుంది.  

ఎన్నో సౌకర్యాలు 
బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ రావాలంటే.. వాటిలో వ్యాయామశాల, క్రీడా ప్రాంగణాలు, సౌర విద్యుత్, పర్యావరణ విద్య, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, స్నానం చేయడానికి వీలుగా షవర్స్, బయో టాయిలెట్స్, గ్రే వాటర్‌ ట్రీట్‌మెంట్, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్, తాగునీటి ఆర్వో ప్లాంట్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సముద్ర తీరాలను ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌(ఐసీజెడ్‌ఎం)కు బాధ్యతలు అప్పగించింది. ఇందులోని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన బీచ్‌లను పరిశీలించి బ్లూ ఫ్లాగ్‌కు అనుగుణంగా వాటిని కేంద్రానికి సిఫారసు చేస్తారు. అనంతరం ప్రపంచ బ్యాంకు నిధులతో వాటిని అభివృద్ధి చేస్తారు. అనంతరం వాటిని కేంద్రం అంతర్జాతీయ జ్యూరీకి ప్రతిపాదిస్తే.. ప్రత్యేక బృందం వచ్చి పరిశీలిస్తుంది. అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు ప్రమాణాల మేరకు ఉంటేనే బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది.  

ఎంపిక చేసిన బీచ్‌లు ఇవీ 
బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం కోసం విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు, గుంటూరు జిల్లాలోని సూర్యలంక, తూర్పు గోదావరి జిల్లాలోని  కాకినాడ, చింతలమోరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, మోళ్లపర్రు, కృష్ణా జిల్లాలోని మంగినపూడి, ప్రకాశం జిల్లాలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌ల సుందరీకరణకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా కేంద్ర బృందం ఈ బీచ్‌లలో పరిసరాలు, రవాణా సౌకర్యం, మౌలిక వసతులను పరిశీలించింది. రెండో దశలో రెండేసి బీచ్‌లలో నీటి నాణ్యతను పరీక్షించనున్నారు. ఇప్పటికే సూర్యలంక, రామాపురంలో ఈ ప్రక్రియ పూర్తయింది. 

ప్రణాళిక ప్రకారం అభివృద్ధి.. 
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని బీచ్‌లను సుందరీకరిస్తున్నాం. బ్లూ ఫ్లాగ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్ర బృందం పరిశీలన చేపడుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. 
– ఎస్‌.సత్యనారాయణ, ఎండీ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ  

మరిన్ని వార్తలు