AP Special: ఆ గోల్డ్‌.. మహా బోల్డ్‌

10 Apr, 2022 09:03 IST|Sakshi

రోల్డ్‌ గోల్డ్‌ నగలపై పెరుగుతున్న మోజు

ఫంక్షన్స్‌లో వీటిదే హవా

రూ.50 నుంచి అందుబాటులో నగ

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిత్యం రూ.40 లక్షల వ్యాపారం

నరసాపురం (పశ్చిమ గోదావరి): వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్‌.. రూపాయి కాసంత కట్‌ ఉంగరం.. స్వర్ణ కంకణం సైజులో గాజులు.. నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు.. విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు.. అందాలు చిందే అర వంకీలు.. తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం.. నడుముకు వడ్డాణం.. కాళ్లకు పట్టీలు.. వీటిలోనూ వందల రకాలు. బంగారు ఆభరణాల తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిపోనివిధంగా అధునాతన డిజైన్లలో రోల్డ్‌ గోల్డ్, వన్‌ గ్రామ్‌ ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గీటు పెడితేనే గాని అవి గోల్డో, రోల్డ్‌ గోల్డో కనుక్కోలేని విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్‌ జరిగినా వీటిదే హవా. పేద, ధనిక భేదం లేకుండా మహిళలంతా వీటినే ధరిస్తున్నారు. 

బంగారాన్ని తలదన్నేలా.. 
బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్‌ గోల్డ్, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర బరువెక్కిన పరిస్థితుల్లో అది ధనికులకు పెట్టుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో సైతం రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలు సైతం ఫంక్షన్లలో రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్‌ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రాగిని ఉపయోగించి వివిధ లోహాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. పైన బంగారం పూత పూయడంతో ఈ నగలకు పసిడి వన్నెలు వస్తున్నాయి. ఇలా తయారుచేసిన ఆభరణాలకు క్వాలిటీని బట్టి ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మెరుపు తగ్గినప్పుడు పూతవేస్తే తిరిగి అవి కొత్త వాటిలా తళతళలాడుతున్నాయి.  

అందుబాటులో ధరలు 
రోల్డ్‌ గోల్డ్, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలు మార్కెట్‌లో వివిధ క్వాలిటీలలో లభిస్తున్నాయి. సాధారణంగా ధరించే చెవి పోగులు, బుట్ట దుద్దులు, తాళ్లు లాంటివి రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. చెయిన్లు, గాజులు, రాళ్ల గాజులు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వడ్డాణాలు, ముత్యాల నెక్లెస్‌లు, ముత్యాల హారాలు లాంటివి నాణ్యతను బట్టి రూ.10 వేల వరకు ధరలు ఉన్నాయి. 

రంగంలోకి బడా కంపెనీలు 
కొంతకాలం క్రితం వరకు కృష్ణా జిల్లా చిలకలపూడిలో తయారయ్యే రోల్డ్‌ గోల్డ్‌  వస్తువులు మార్కెట్‌కు విరివిగా వచ్చేవి. రోల్డ్‌ గోల్డ్‌ కొత్త ట్రెండ్‌ సంతరించుకోవడంతో బడా కంపెనీలు రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం రోల్డ్‌ గోల్డ్‌ నగలకు పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా ముంబై, సూరత్, అమృత్‌సర్, ఆగ్రా, చెన్నై ప్రాంతాల్లో యంత్రాలపై తయారుచేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

డిమాండ్‌ అంతా.. ఇంతా కాదు
బంగారు ఆభరణమైతే అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. కానీ రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులపై పెట్టిన సొమ్ము వృథా. అయినా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న మొత్తమే కాబట్టి వృథా అయినా ఫర్వాలేదన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారు ఆభరణాలకు మించి రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాల అమ్మకాలు సాగుతుండటం విశేషం. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇమిటేషన్‌ జ్యూవెలరీ విక్రయించే దుకాణాలు 700 వరకు ఉన్నాయి. ఇళ్లల్లో సైతం చిన్నపాటి షాపులు నిర్వహిస్తూ మహిళలు వీటి అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీజన్‌లో అయితే రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బంగారు ఆభరణాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇమిటేషన్‌ జ్యూవెలరీ అమ్మకాలు రోజుకు రూ.40 లక్షల వరకు సాగుతున్నట్టు అంచనా. ఒకప్పుడు పట్టణానికి ఒకటి, రెండు రోల్డ్‌ గోల్డ్‌ షాపులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి పట్టణంలో 20 నుంచి 30 వరకు షాపులు ఉన్నాయి. గ్రామాలకే వెళ్లి వన్‌ గ్రాము వస్తువులు తీసుకెళ్లి విక్రయించేవారు సైతం పెరిగారు.

రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలే బెటర్‌
అరకాసు బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. మాకు నచ్చిన డిజైన్లలో రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులు దొరుకుతున్నాయి. బంగారం కంటే ఎక్కువ డిజైన్లు వీటిలో లభిస్తున్నాయి. వాటిని ధరిస్తే రోల్డ్‌ గోల్డ్‌ అన్న ఆలోచనే రాదు. ప్రస్తుత తరుణంలో రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలే బెటర్‌. 
– అద్దేపల్లి రాధిక, గృహిణి

బంగారు కంటే మిన్నగా..
ఇదివరకు రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులు వేసుకుంటే అవి బంగారం కాదని చాలా ఈజీగా తెలిసిపోయేది. పెద్దగా నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులు బంగారం వస్తువుల కంటే బాగుంటున్నాయి. రూ.5 వేలు పెట్టి రోల్డ్‌ గోల్డ్‌ వస్తువు కొని పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది. అదే వస్తువు బంగారంతో చేయించాలంటే రూ.5 లక్షలకు పైనే పెట్టాలి. ఇదే బెటర్‌ కదా. 
– కె.సత్యవాణి, గృహిణి

అమ్మకాలు బాగా పెరిగాయి
రోల్డ్‌ గోల్డ్‌ వస్తువుల అమ్మకాలు బాగా పెరిగాయి. మా షాపులకు మధ్య తరగతివారే కాకుండా సంపన్న వర్గాలు వారు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మంచి మంచి డిజైన్లలో వస్తువులు దొరుకుతున్నాయి. చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతాం. 
– శిరం చంటి, రోల్డ్‌ గోల్డ్‌ షాపు 
యజమాని, నరసాపురం

మరిన్ని వార్తలు