పెరుగుతున్న గోదావరి ఉధృతి..

13 Aug, 2020 11:07 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 24.75 మీటర్లు చేరింది. ఇప్పటికే స్పిల్ ఛానల్ కు అనుసంధానంగా ఉన్న గోదావరి గట్టు తెగిపోవడంతో స్పిల్ ఛానల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. పోలవరం వద్ద 10.61 వరకు నీటిమట్టం నమోదయింది. ప్రాజెక్ట్ ఎగువన ఉన్న కొత్తూరు కాజ్‌వే పైకి 5 అడుగులు నీరు చేరడంతో  సుమారు 19 గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రతి సంవత్సరం గోదావరికి వరద వచ్చే సమయంలో కొత్తూరు కాజ్‌వే పై వరద నీరు చేరడంతో గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే గోదావరి అడ్డుగా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మించడంతో గోదావరి వరద తక్కువగా వచ్చిన ఉధృతి పెరిగి గిరిజన గ్రామాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తూరు కాజ్‌వే పై రాకపోకలకు పోలీసులు  ఆంక్షలు విధించారు. గిరిజనులు ప్రయాణించేందుకు పడవలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు