ఆంధ్రప్రదేశ్‌: అతివల్లో ‘అతి బరువు’

13 Apr, 2021 08:22 IST|Sakshi

రాష్ట్రంలో పెరుగుతున్న ఒబెసిటీ బాధితులు

పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో భారీగా పెరుగుదల

ప్రతి 100 మంది మహిళల్లో 36.3 మంది ఊబకాయులే

మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఒబెసిటీ సమస్య 5.2 శాతం తక్కువే

కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడి

మితాహారం.. వ్యాయామమే సరైన మందు అంటున్న వైద్యులు

సాక్షి, అమరావతి: ఇంటి బరువు బాధ్యతల్ని ఓర్పుగా నెట్టుకొచ్చే మగువల సహనానికి సరిహద్దులే ఉండవు. అలుపనే మాటే ఎరుగని ఆ మహిళలు ఇప్పుడు ఇట్టే అలసిపోతున్నారు. ఇందుకు కారణం ఇంటి బరువు బాధ్యతలు కానే కాదు. జీవనశైలి సమస్యలు వారిని చుట్టేస్తున్నాయి. ఊబకాయం (ఒబెసిటీ) రూపంలో బాధిస్తున్నాయి. తెలుగు నేలపైనా ఈ సమస్య అధికమవుతోంది. మగవారితో పోలిస్తే మహిళలు ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.

జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే ఈ విషయాలను స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రతి వందమంది మహిళల్లో 36.3 మంది అధిక బరువుతో ఉన్నట్టు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో అధిక బరువుతో ఉన్న పురుషుల సంఖ్య 31.1 శాతం కాగా.. 36.3 శాతం మహిళలు ఊబకాయం బారినపడ్డారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. అనేక సమస్యలనూ ఎదుర్కొంటున్నారు.

పట్టణాల్లో మరీ ఎక్కువ
పల్లెల్లో కంటే పట్టణాల్లో మహిళలు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 44.4 శాతం మంది మహిళలు ఒబెసిటీతో బాధపడుతుండగా.. పల్లెల్లో 32.6 శాతం మంది బాధితులు ఉన్నారు. అదే పురుషులైతే పట్టణాల్లో 37.7 శాతం మంది, పల్లెల్లో 28 శాతం మంది ఒబెసిటీ బారిన పడినట్టు వెల్లడైంది.

రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం
ఒబెసిటీ సమస్య రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళల విషయానికి వస్తే.. అవగాహన లేకపోవడం, వ్యాయామం చేసేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఊబకాయం బారిన పడుతున్నారు. 40 ఏళ్లకే చాలామంది మహిళలు కీళ్ల నొప్పులకు గురవుతున్నారు. ఒబెసిటీ కారణంగా ఎక్కువ మంది హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

జీవనశైలి జబ్బులుగా చెప్పుకునే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దగ్గరవుతున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ రక్తప్రసరణ వ్యవస్థలో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన ఇతర అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌లు, డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఒబెసిటీ కారణమవుతోంది.

వ్యాయామమే సరైన మందు
మితాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువును తగ్గించుకోవచ్చు. కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థం (ఫైబర్‌) అంటే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. 
–డాక్టర్‌ రాంబాబు, ప్రొఫెసర్, కేజీహెచ్‌ ఆస్పత్రి, విశాఖ
 

>
మరిన్ని వార్తలు