పుంజుకుంటున్న పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు

24 Nov, 2020 04:46 IST|Sakshi

పెట్రోల్‌ అమ్మకాల్లో 20 శాతం వృద్ధి

కోవిడ్‌ ముందుస్థాయికి డీజిల్‌ అమ్మకాలు

వరుసగా రెండు నెలలు వ్యాట్‌ ఆదాయంలోనూ వృద్ధి

లాక్‌డౌన్‌తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్‌ అమ్మకాల్లో భారీ వృద్ధి రేటు నమోదవుతుండగా, డీజిల్‌ అమ్మకాలు కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు నెలల నుంచి పెట్రోల్, డీజిల్‌ ఆదాయంలో నమోదవుతున్న వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్రో వ్యాట్‌ ఆదాయంలో 6.39 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్టోబర్‌కల్లా 25.24 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో రూ.851.40 కోట్లుగా ఉన్న పెట్రో వ్యాట్‌ ఆదాయం.. ఈ ఏడాది 6.39 శాతం వృద్ధితో రూ.905.78 కోట్లకు చేరింది. అలాగే అక్టోబర్‌లో 25.24 శాతం వృద్ధితో రూ.750.35 కోట్ల నుంచి రూ.939.76 కోట్లకు చేరింది. లాక్‌డౌన్‌తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టపోగా రెండవ త్రైమాసికంలో కొద్దిగా కోలుకొని 3.76 శాతం వృద్ధి నమోదయ్యింది. 

పెరిగిన సొంత వాహనాల వినియోగం
లాక్‌డౌన్‌ తర్వాత డీజిల్‌తో పోలిస్తే పెట్రోల్‌ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోందని పెట్రోలియం డీలర్లు పేర్కొంటున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు కంటే సొంత వాహనాలకే వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో రాష్ట్రంలో పెట్రోల్‌ అమ్మకాల్లో 20 శాతం వరకు వృద్ధి కనిపిస్తోందని ఏపీ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తాము ప్రతి నెలా సగటున 4,500 లీటర్ల పెట్రోల్‌ విక్రయిస్తుండగా గత రెండు నెలల నుంచి 4,700 లీటర్లు విక్రయిస్తున్నట్లు గుంటూరుకు చెందిన డీలర్‌ ‘సాక్షి’కి వివరించారు. ఇదే సమయంలో డీజిల్‌ అమ్మకాలు మాత్రం కోవిడ్‌ ముందు స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ,  సరుకు రవాణా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవడం..డీజిల్‌ అమ్మకాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా 8,000 లీటర్ల వరకు డీజిల్‌ విక్రయిస్తుండగా, ఇప్పుడది 7,000 లీటర్ల స్థాయికి చేరిందన్నారు. ఒకటి రెండు నెలల్లో డీజిల్‌ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు.

ఏడు నెలల్లో రూ.5,448.79 కోట్ల ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,448.79 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలంలో ఈ ఆదాయం రూ.5,965.50 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో రూ.1,860.09 కోట్లుగా ఉన్న ఆదాయం ద్వితీయ త్రైమాసికానికి రూ.2,648.98 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికం రెండు నెలల్లో మంచి వృద్ధిరేటు నమోదు కావడంతో పూర్తి ఏడాది కాలానికి లాక్‌డౌన్‌ నష్టాన్ని పూడ్చుకొని వృద్ధి బాట పట్టగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు