శ్రీశైలంలోకి 72,098  క్యూసెక్కులు

28 Jul, 2020 03:33 IST|Sakshi

ప్రాజెక్టులో 89.71 టీఎంసీల నిల్వ

సాగర్‌లో పెరుగుతున్న నీటి మట్టం 

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. సోమవారం సాయంత్రానికి 72,098 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 854.2 అడుగుల్లో 89.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 43,105 క్యూసెక్కులను తెలంగాణ జెన్‌కో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో నాగార్జున సాగర్‌లోకి 42,378 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ 192.10 టీఎంసీలుగా ఉంది. 

► పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల నదిలో వరద ప్రవాహం తగ్గింది. 
► ఆల్మట్టిలోకి 17,070 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుత్‌ కేంద్రం ద్వారా దిగువకు 5,000 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 4,565 క్యూసెక్కులే చేరుతుండటంతో గేట్లు మూసేశారు. 
► విద్యుత్‌ కేంద్రం ద్వారా 5,300 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత తగ్గనుంది.
కృష్ణా ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 435 టీఎంసీలు అవసరం
►కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 125 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నిండాలంటే 121, పులిచింతల నిండాలంటే 34, శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ వెలిగోడు, అవుకు, గోరకల్లు, గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, చిత్రావతి, సోమశిల, కండలేరు నిండాలంటే 155 టీఎంసీలు.. వెరసి 435 టీఎంసీల నీరు అవసరం.
►గతేడాది ఆగస్టులో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు