స్వచ్ఛ అఖండ గోదావరి

9 Apr, 2023 05:54 IST|Sakshi

రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు నదీ జలాలు స్వచ్ఛం

కాలుష్య నదీ ప్రాంతాల నుంచి గతేడాది గోదావరిని తొలగించిన సీపీసీబీ

గతంలో గోదావరిలోకి యథేచ్ఛగా వ్యర్థ జలాలు.. 2018లో నదిని కాలుష్య కాసారంగా ప్రకటించిన సీపీసీబీ

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అఖండ గోదావరి పరిరక్షణకు చర్యలు

ఎస్టీపీల నిర్మాణం.. మురుగు నీటిని శుద్ధి చేశాకే నదిలోకి

దాంతో స్వచ్ఛంగా మారిన జలాలు

సాక్షి, అమరావతి: ఒకప్పుడు కాలుష్యకాసారమైన అఖండ గోదావరి నది ఇప్పుడు స్వచ్ఛమైన జలా­లతో కళకళలాడుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గోదావరి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు గోదా­వరి నీటిని నేరుగా తాగవచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు అఖండ గోదావరి జలాలు స్వచ్ఛమైనవని సీపీసీబీ కూడా తేల్చింది.

సీపీసీబీ గతేడాది నవంబర్‌లో గోదావరి జలాలపై అధ్యయనం చేసింది. జలాలు కాలుష్య రహితంగా మారినట్లు వెల్లడించింది. కాలుష్య కాసారాల జాబితా నుంచి అఖండ గోదా­వరిని తొలగించింది. మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లా­లోని పశ్చిమ కనుమల్లో సముద్రానికి 1,067 మీటర్ల ఎత్తున మొదలైన గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,465 కి.మీ.ల దూరం ప్రవహించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఇందులో తెలంగాణలో భద్రాచలం మండలం రాయనపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాజమహేంద్రవరం వరకూ ఉన్న గోదావరి నిత్యం ప్రవాహంతో నిండుగా కన్పించడం వల్ల అఖండ గోదావరి అని పిలుస్తారు. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు నదీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు, రాజమహేంద్రవరం నగర­పాలక సంస్థ మురుగు నీటిని, వ్యర్థాలను యథే­చ్ఛగా నదిలోకి వదిలేసేవి.

పారిశ్రామిక వ్యర్థ జలా­లను శుద్ధి చేయకుండానే నదిలో కలిపేవారు. దాంతో గోదావరి జలాలు కలుషితమయ్యాయి. సీపీసీబీ 2018లో నిర్వహించిన అధ్యయనంలో అఖండ గో­దా­వరి జలాల్లో పీహెచ్‌ 6.5 నుంచి 8.5, డీవో (డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌) లీటర్‌కు 5 మిల్లీ గ్రాములు, కోలీఫామ్‌ వంద మిల్లీలీటర్లకు 1742, నీటిలో కరిగిన ఘన పదా­ర్థాలు మోతాదుకు మించి ఉ­న్నట్లు తేలింది. దాంతో అఖండ గోదావరిని కాలు­ష్య కాసారాల జాబితాలో ఐదో విభాగంలో చేర్చింది. ఆ విభాగం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

నేడు స్వచ్ఛతకు చిరునామా
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక గోదావరి పరి­రక్షణకు ప్రణాళిక రచించారు. నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు, రాజమహేంద్రవరంలో మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేశాకే నదిలో కలపాలని ఆదేశించారు. దాంతో నదీ తీర ప్రాంతాల్లో వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే కలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

రాజమహేంద్రవరంలో రోజు­కు 80.6 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేలా రెండు చోట్ల భారీ ఎస్టీపీ (సీవ­రేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు)లను నిర్మించారు. వాటి ద్వారా రాజమహేంద్రవరం నగరం మురుగునీటిని శుద్ధి చేశాకే నదిలోకి వదులు­తున్నారు. పరిశ్రమల వ్యర్థాలను కూడా ఎస్టీపీ­లలో శుద్ధి చేశాకే వదులుతున్నారు. దాంతో అఖండ గోదావరి జలాలు స్వచ్ఛంగా మారాయి. అఖండ గోదావరి పరిరక్ష­ణకు సీఎం జగన్‌ తీసుకున్న చర్యలను పర్యా­వరణవేత్తలు, ప్రజలు ప్రశంసిస్తున్నారు.  

మరిన్ని వార్తలు