విశాఖలో క్రేజీ క్రూయిజ్‌

9 Jun, 2022 04:50 IST|Sakshi
రాత్రి సమయంలో కార్డీలియా క్రూయిజ్‌ షిప్‌

విశాఖ నుంచి కార్డీలియా షిప్‌ మొదటి ట్రిప్‌ ప్రారంభం

షిప్‌ లోపల ఇంద్రభవనంలా ఉంది: మంత్రి రోజా

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కార్డీలియా క్రూయిజ్‌ షిప్‌ ప్రారంభంతో విశాఖ ప్రజల కోరికే కాకుండా రాష్ట్ర ప్రజల కోరికా నేరవేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విశాఖ పోర్టు నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి బయలుదేరిన మొదటి క్రూయిజ్‌ షిప్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. కోవిడ్‌ తర్వాత విహార యాత్ర కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇదో మంచి అవకాశమన్నారు. నౌక లోపల చూస్తే అలలపై ఇంద్రభవనంలా ఉందన్నారు.  
నౌకలో ప్రయాణికులతో మాట్లాడుతున్న మంత్రి రోజా 

ఈ షిప్‌ మొదటి ట్రిప్‌నకు 1200 మంది బుక్‌ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 786 క్యాబిన్స్‌ కలిగిన ఈ షిప్‌లో 600 మంది పనిచేస్తున్నారని, వారిలో 92 శాతం భారతీయులేనన్నారు. 900 సీట్లు కలిగిన పెద్ద థియేటర్, స్విమ్మింగ్‌ పూల్స్‌ చాలా బాగున్నాయన్నారు. రుషికొండను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి స్టేల ద్వారా అడ్డుకుంటోందని మంత్రి రోజా విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుద కల్యాణి, పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబంతో వెళ్తున్నా..
 నా కుటుంబం మొత్తం 9 మంది ఈ నౌకలో విహార యాత్రకు వెళ్తున్నాం. ఎప్పుడు లోపలకు వెళ్తామా అని ఆత్రుతగా ఉంది. కుటుంబం మొత్తానికి రూ.1.8 లక్షలు వెచ్చించాం. 
– కాశీ, విశాఖ వాసి

అన్ని సౌకర్యాలు
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పించాం. అత్యవసర సమయంలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నెల 22  మినహా సెప్టెంబర్‌ వరకూ ప్రతి బుధవారం విశాఖ నుంచి షిప్‌ బయలుదేరుతుంది.  
– అల్‌థాఫ్, నిర్వాహకుడు 

మరిన్ని వార్తలు