కళాకారులకు గుర్తింపు కార్డులు : మంత్రి రోజా

29 Jul, 2022 04:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతోపాటు తెలుగు కళా రూపాలను పరిరక్షించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సచివాలయంలో గురువారం సాంస్కృతికశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహించి విజేతలకు సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.

రాష్ట్రంలో తెలుగు కళాకారులను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించు కోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా కళారూపాల జాబితాను సిద్ధం చేయాలని.. ఆడిటోరియాలను గుర్తించి కళారూపాల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌భార్గవ, సాంస్కృతిక అకాడమీల చైర్‌పర్సన్లు, సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు