సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు‌

22 Sep, 2020 06:10 IST|Sakshi

నగదు బదిలీ అమల్లో దేశానికే ఏపీ ఆదర్శం 

అన్ని రాష్ట్రాల్లోనూ సీఎం జగన్‌ విధానాలు వివరిస్తాం 

ఏపీకి అండగా ఉంటాం : కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ 

సాక్షి, అమరావతి: వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రశంసించారు. ప్రజలకు ఏ మాత్రం భారం కాకుండా విద్యుత్‌ రంగాన్ని కాపాడాలనే ఆయన ఆలోచనలు అభినందనీయమన్నారు. సంస్కరణ దిశగా అడుగులేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఎండీ సాయిప్రసాద్‌ సోమవారం ఆర్‌కే సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ వివరాలను శ్రీకాంత్‌ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. 

► రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సీఎం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రికి శ్రీకాంత్‌ వివరించారు. వ్యవసాయ సబ్సిడీని రైతు ఖాతాలోకే ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రైతుపై భారం పడకుండా చేస్తున్నామని మంత్రికి తెలియజేశారు.  
► నగదు బదిలీ విషయంలో వైఎస్‌ జగన్‌ నిర్ణయం సాహసోపేతమని, రైతుకు మేలు చేయాలనే ఆలోచన అభినందనీయమని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ ముందడుగును అన్ని రాష్ట్రాలకు వివరించి చెబుతామన్నారు. ఇలాంటి డైనమిక్‌ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కొనియాడారు.  
► రైతుల కోసం రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల గురించి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ సాయిప్రసాద్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ప్రాజెక్టుకు అవసరమైన చేయూతనిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా