ఏపీలో రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుముఖం

29 May, 2022 05:37 IST|Sakshi

కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2020లో రహదారి ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రహదారి ప్రమాదాలు, వాటి వల్ల సంభవించే మరణాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.

2019తో పోలిస్తే 2020లో రహదారి ప్రమాదాలు 18.46 శాతం తగ్గగా, మరణించిన వారి సంఖ్య 12.84 శాతం, క్షతగాత్రుల సంఖ్య 22.84 శాతం తగ్గిందని తెలిపింది. 2020లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3,66,138 ప్రమాదాల్లో 1,31,714 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు–2020 నివేదిక ప్రకారం 2016 నుంచి చూస్తే రహదారి ప్రమాదాల్లో 0.46 శాతం స్వల్ప తగ్గుదల కనిపిస్తోందని తెలిపింది.  

మరిన్ని వార్తలు