Prakasam: దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం..  ఐదుగురు దుర్మరణం

9 Aug, 2022 13:03 IST|Sakshi

వేకువజామున రెండు గంటలు. అంతా చిమ్మ చీకటి. కంభం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఒక్క కుదుపు. ముందు వెళ్తున్న లారీ వేగం తగ్గి నెమ్మదించింది. వెనుకనే వస్తున్న కారు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమి జరిగిందో తెలిసే లోపు అందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తమ ఇష్టదైవం మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. కుమారుడు.. కుటుంబ సభ్యులు, బంధువులు కళ్లెదుటే విగతజీవులుగా మారడం ఆయా కుటుంబాలను పెను విషాదంలోకి నెట్టింది. 

కంభం: ఉన్నత చదువు కోసం యూకే వెళ్లిన తన కుమారుడి మొక్కు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అనంతపురం–అమరావతి రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన జోలకంటి హనిమిరెడ్డి, జోలకంటి గురవమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా చిన్న కుమారుడు జోలకంటి నాగిరెడ్డి (23) గుంటూరులో బీటెక్‌ పూర్తి చేసి పది నెలల క్రితం ఎంఎస్‌ చదివేందుకు యూకే వెళ్లాడు.

పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన తన కుమారుడి తిరుపతి మొక్కు తీర్చేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లలో బయలు దేరారు. ఒక కారులో నాగిరెడ్డి డ్రైవింగ్‌ చేస్తుండగా ఆ కారులో అతని తాత, అమ్మమ్మ, ఇద్దరు చిన్న అమ్మమ్మలు కూర్చున్నారు. మరో కారులో నాగిరెడ్డి తల్లిదండ్రులు, సోదరుడు, మరో 8 మంది అతని బంధువులు ఉన్నారు. కారు కంభం సమీపంలో ఫ్లైవోవర్‌ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయిపోయింది.

ఈ ఘటనలో కారులో ఉన్న జోలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమారెడ్డి (70), అతని భార్య ఆదిలక్ష్మమ్మ (60), ఆదిలక్ష్మమ్మ సోదరి పల్లె అనంత రామమ్మ (50), మరో సోదరి భూమిరెడ్డి గురువమ్మ (60)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చిలకల పెద్ద హనిమారెడ్డికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పల్లె అనంతరామమ్మకు భర్త, ఒక కుమార్తె ఉన్నారు. గురువమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవించే వారు. పల్లె అనంతరామమ్మ బొల్లపల్లి మండలం దేమిడిచర్లలో నివాసం ఉంటుండగా, మిగిలిన వారందరూ సిరిగిరిపాడులో నివాసం ఉంటున్నారు.  

కష్టాలు తీరుస్తాడనుకుంటే కడుపుకోత మిగిల్చాడు  
వ్యవసాయం, పొలం పనులు చేసుకుంటూ తన చిన్నకుమారుడిని ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించగా త్వరలో వచ్చి కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు నాగిరెడ్డి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. నాగిరెడ్డి తల్లిదండ్రులు కుమారుడిని బీటెక్‌ వరకు గుంటూరులో చదివించుకున్నారు. కుమారుడు చదువులో రాణిస్తుండటంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పు చేసి మరీ విదేశాలకు పంపించి చదివిస్తున్నట్లు బంధువులు తెలిపారు. త్వరలో చదువు ముగించుకొని తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటాడని అనుకుంటున్న ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.  

తల్లిదండ్రులతో పాటు కుమారుడు మృతి
జోలకంటి నాగిరెడ్డి తల్లి గురవమ్మ ఈ ప్రమాదంలో కుమారుడితో పాటు, ఆమె తల్లిదండ్రులు చిలకల పెద్ద హనిమారెడ్డి, తల్లి ఆదిలక్ష్మమ్మ, చిన్నమ్మలు పల్లె అనంత రామమ్మ, భూమిరెడ్డి గురవమ్మలను కోల్పోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.  

పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు:  
సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన సీఐ యం.రాజేష్, ఎస్సై నాగమల్లేశ్వరరావు మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామం తీసుకెళ్లారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: ముర్రా.. మేడిన్‌ ఆంధ్రా

మరిన్ని వార్తలు