దూకుడుతో నష్టం.. భవిత ఎంతో కష్టం 

28 Jun, 2021 04:07 IST|Sakshi

ప్రమాద బాధితుల్లో 40 ఏళ్లలోపువారే ఎక్కువ  

18 ఏళ్లలోపు వారికీ తల్లిదండ్రులు బైకులిస్తున్నారు 

శృతిమించిన స్పీడుతో ప్రమాదాలు 

ట్రామాకేర్‌ సెంటర్లకు వైద్యానికి వస్తున్న వారిలో యువకులే ఎక్కువ 

సాక్షి, అమరావతి: జాతీయ రహదారులు, పట్టణ రోడ్లమీద.. గల్లీల్లోను కుర్రాళ్ల దూకుడు ప్రాణాల మీదకు తెస్తోంది. దూకుడుతో పాటు ద్విచక్ర వాహనంలో స్పీడుగా వెళ్లడమనేది ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. దీనివల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. అనేకమంది శాశ్వత వైకల్య బాధితులుగానూ మారుతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు నాన్నా జాగ్రత్త.. నాన్నా జాగ్రత్త అంటూ తల్లిదండ్రులు పదేపదే చెబుతుంటారు. కానీ యువకులు ఇలాంటివి పెడచెవిన పెడుతున్నారు. ఉదాహరణకు 2020 సంవత్సరంలో విశాఖపట్నం లోని కింగ్‌జార్జి ఆస్పత్రి ట్రామాకేర్‌లో 613 మంది ప్రమాద బాధితులు నమోదు కాగా.. అందులో 40 ఏళ్లలోపు వారే 325 మంది ఉన్నారు. అంటే 50 శాతం కంటే ఎక్కువ. ఆ ఏడాది ఇదే ఆస్పత్రిలో 137 మంది మృతిచెందారు. వీరిలో 82 మంది కుర్రాళ్లే. 80 శాతం మంది ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురైనవారే. హైవేల్లోనే కాకుండా గల్లీల్లో కూడా ఇలాంటి వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. 18 ఏళ్ల లోపు వారికీ తల్లిదండ్రులు బైకులిస్తుండటం కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమవుతోంది. 

లైసెన్సు రాకముందే.. 
చాలాప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వారిలో 18 ఏళ్లలోపు వారూ ఉన్నారు. ఎక్కువగా వీళ్లు 150 సీసీ బైకుల్లో రైడింగ్‌ చేయడం, బ్యాలెన్సు చేయలేక పడిపోవడం వంటివి జరుగుతున్నాయి. చదువుకునే వయసులోనే ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు ఫ్రాక్చర్‌లు చేసుకుంటున్న ఘటనలున్నాయి. అనేకమంది హెల్మెట్‌ కూడా లేకుండా డ్రైవ్‌ చేసి, తలకు గాయాలై తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. ప్రమాదానికి గురైన వారిలో 30 శాతం మందికి మేజర్‌ ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. విచిత్రమేమంటే 2020 మార్చి నుంచి కోవిడ్‌ ఉంది. అయినా సరే 2020 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు గతంలో లాగా కాకపోయినా ఓ మోస్తరు ప్రమాదాలు జరిగాయి. ఇందులో కుర్రాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదానంతరం శస్త్రచికిత్సలు చేయించుకున్నా గతంలో వలె ఉండలేకపోతున్నారు. కొందరు శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు 

టీనేజీలో గుర్తింపు సమస్య 
చాలామంది టీనేజీ కుర్రాళ్లలో ఐడెంటిటీ క్రైసిస్‌ (గుర్తింపు సమస్య) ఉంటుంది. నన్ను అందరూ చూడాలి, అందరికంటే నేనే గొప్ప.. ఇలాంటివి. దీనివల్ల ఏదో ఒకటి చేసి వాళ్లు గుర్తింపు కోరుకోవడం అన్నమాట. ఇలాంటివాళ్లలో బైక్‌రైడింగ్‌ చేసేవాళ్లు ఎక్కువ. వాళ్లు స్పీడుగా నడిపితే వాళ్లవైపు అందరిచూపు ఉంటుందని అనుకుంటారు. మరికొందరిలో నార్సిస్టిక్‌ సింప్టమ్స్‌ ఉంటాయి. అంటే సెల్ఫ్‌ ఐడెంటిటీ అంటారు. ఇలాంటి వారిలో ఏదో ఒక మానసికమైన జబ్బు ఉంటేనే ఇలాంటివి చేస్తుంటారు. వీరికి బాగా కౌన్సెలింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. 
– డాక్టర్‌ వెంకటరాముడు, మానసిక వైద్యనిపుణులు, కడప సర్వజనాస్పత్రి  

మరిన్ని వార్తలు