అభివృద్ధి దారులు.. వేగంగా రోడ్ల నిర్మాణం 

4 Jun, 2022 17:52 IST|Sakshi

ఐదు నియోజకవర్గాల్లో  సాగుతున్న పనులు

ఇప్పటికే పలుచోట్ల మారిన రూపురేఖలు

ఈనెలాఖరులోగా మొత్తం పూర్తి చేసేలా చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా నాణ్యాతా ప్రమాణాలను పాటిస్తూ బీటీ, సీసీరోడ్లు నిర్మిస్తోంది. 

నెల్లూరు(బారకాసు): వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు వినతులు ఇస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ పట్టింది. గతంలో ప్రతిపాదనలకే పరిమితం కాగా నేడు ఎన్నో కార్యరూపం దాల్చుతున్నాయి. 

ఎక్కడెక్కడంటే.. 
ఆర్‌అండ్‌బీ శాఖ నెల్లూరు డివిజన్‌ పరిధిలోని నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు, కొత్తగా రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటితో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎనిమిది పనులను పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణాలను జూన్‌ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 

ఇప్పటికే పూర్తి 
నెల్లూరు డివిజన్‌ పరిధిలో నెల్లూరు – కృష్ణపట్నం రోడ్డు (మాదారాజుగూడురు నుంచి బ్రహ్మదేవి వరకు), పొదలకూరు – రాపూరు రోడ్డు, నెల్లూరుపాళెం – ఆత్మకూరు, ఆత్మకూరు – సోమశిల, ఈపూరు ఫిషరీస్‌ రోడ్డు, నెల్లూరు – అనికేపల్లి (వయా గొలగముడి), మొగళ్లపాళెం – సౌత్‌మోపూరు, ములుముడి – తాటిపర్తి రోడ్డు పనులు పూర్తయ్యాయి.  

గడువులోగా పూర్తికి చర్యలు 
నెల్లూరు డివిజన్‌ పరిధిలోని రోడ్లు నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది చోట్ల పనులు పూర్తి చేశాం. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపపట్టాం. కిందిస్థాయి అధికారులతో సమీక్షిస్తూ పనుల పురోగతి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా సమస్యల్లేవు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. 
–  రామాంజనేయులు, ఈఈ, నెల్లూరు డివిజన్, అర్‌అండ్‌బీ 
 

మరిన్ని వార్తలు