Andhra Pradesh: కీలక ముందడుగు.. సమగ్ర క్యాన్సర్‌ కేర్‌కు రోడ్‌ మ్యాప్‌

1 Nov, 2022 03:14 IST|Sakshi

తొలి దశలో రూ.119.58 కోట్లతో ఏడు బోధనాస్పత్రుల్లో సదుపాయాలు 

పరిపాలనా అనుమతులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

అనంతపురం, కాకినాడ, చినకాకాని, గుంటూరులో రూ.61.93 కోట్లతో లినాక్, ఇతర పరికరాల ఏర్పాటు  

రూ.12.15 కోట్లతో శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలులోనూ ఏర్పాట్లు 

ఏడుచోట్ల రూ.21 కోట్లతో ఆపరేషన్‌ థియేటర్ల అభివృద్ధి 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు.. వ్యాధి నియంత్రణ, నివారణకు కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ను అమలుచేయడానికి రోడ్‌మ్యాప్‌ ఖరారైంది. ఇందులో భాగంగా తొలిదశ కింద 2022–24లో ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.119.58 కోట్లతో మౌలిక వనరుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండో దశలో మిగిలిన ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ వైద్య సదుపాయాలను ఏర్పాటుచేస్తారు.  

రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్‌ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు గత టీడీపీ సర్కార్‌ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. దీంతో క్యాన్సర్‌ చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌ చికిత్స సదుపాయాలు, బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అంతేకాక.. వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడానికి క్యాన్సర్‌ను నోటిఫైడ్‌ జబ్బుల జాబితాలోకి చేర్చారు.

ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సలహాదారుగా నియమించారు. ఈయనతో పాటు మరికొందరు మేధావుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు. ఈ క్రమంలో ప్రజలకు ప్రాథమిక క్యాన్సర్‌ చికిత్స అందుబాటులోకి తేవడంతో పాటు, క్యాన్సర్‌ రోగులు చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అడ్వాన్స్‌డ్‌ చికిత్సను అందుబాటులోకి తేవడంపై చర్యలకు ఉపక్రమించారు. 

రూ.74.08 కోట్లతో పరికరాల ఏర్పాటు 
విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల పరిధిలోని చినకాకాని క్యాన్సర్‌ ఆస్పత్రి, అనంతపురం, కాకినాడ జీజీహెచ్‌లకు లినాక్, సీటీæ సిమ్యులేటర్, బ్రాకీథెరపీ, మామోగ్రామ్‌ పరికరాలు, గుంటూరు జీజీహెచ్‌కు మామోగ్రామ్, ఇతర పరికరాలు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు రూ.61.93 కోట్లు ఖర్చుచేయనుంది. అదే విధంగా రూ.12.15 కోట్లతో శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు జీజీహెచ్‌లలోనూ లినాక్, ఇతర పరికరాలు సమకూర్చడానికి ఏర్పాట్లుచేయనున్నారు. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రుల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్‌ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది.  
  
ఆధునిక టెక్నాలజీతో రేడియేషన్‌ 
క్యాన్సర్‌ బాధితులకు రేడియేషన్‌ థెరపీ అందించడానికి ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక టెక్నాలజీలో లినాక్‌ కీలకమైనది. క్యాన్సర్‌ చికిత్సకు పేరొందిన టాటా మెమోరియల్, సహా ఇతర కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లినాక్‌ను వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే అధునాతన లినాక్‌ అందుబాటులో ఉంది.

గుంటూరు మినహా మిగిలిన చోట్ల క్యాన్సర్‌కు కోబాల్ట్‌ థెరపీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాన్సర్‌ కణితి ఉన్న ప్రాంతంతోపాటు శరీరంలోని ఇతర భాగాలు రేడియేషన్‌కు ప్రభావితం అవుతాయి. అదే లినాక్‌ ద్వారా రేడియేషన్‌లో కణితిపై ఎక్కువ డోసుతో రేడియేషన్‌ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 

మిగిలిన రూ.45.5 కోట్లతో ఇలా.. 
ఇక ఏడు బోధనాస్పత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌ల అభివృద్ధి, సర్జికల్‌ పరికరాలు సమకూర్చడానికి రూ.21కోట్లు కేటాయించారు. అదే విధంగా పాథాలజీ యూనిట్‌ల అభివృద్ధికి రూ.10.50 కోట్లు.. మందులు, కీమోథెరపీకి అవసరమయ్యే సదుపాయాల కల్పనకు రూ.14 కోట్లు ఖర్చుచేస్తారు. అదే విధంగా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి పాలియేటివ్‌ కేర్, ప్రివెంటివ్‌ అంకాలజీలో ప్రత్యేక శిక్షణనిస్తారు.    

ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం 
తొలి నుంచి మా ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రూ.16వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కింద 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేస్తున్నాం. తాజాగా మరో రూ.119.58 కోట్ల కాంప్రెహెన్సివ్‌ కేర్‌ అమలుకు శ్రీకారం చుట్టాం.  
– విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  

అత్యాధునిక పరికరాలు సమకూరుస్తున్నాం 
రూ.119.58 కోట్లతో తొలిదశ కాంప్రెహెన్సివ్‌ కేర్‌ అభివృద్ధికి అనుమతులిచ్చాం. ఇదికాకుండా కర్నూలు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లకు రూ.71 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడానికి చర్యలు తీసుకున్నాం. ఈ రెండు ఆస్పత్రులకు లినాక్, బ్రాకీథెరపీ, పెట్‌సీటీ, సీటీ సిమ్యులేటర్‌ పరికరాలు సమకూర్చనున్నాం. పరికరాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది.  
– ఎంటీ కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ   

మరిన్ని వార్తలు