East Godavari: దారి.. అద్దంలా మారి..

28 Apr, 2022 10:22 IST|Sakshi

సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చాన్నాళ్లుగా ప్రజలకు నరకం చూపిస్తున్న రహదారులు బాగుపడుతున్నాయి. పాఠశాలల తరహాలోనే  ‘నాడు–నేడు’ పథకం కింద రహదారుల తీరుతెన్నులనూ మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడూ రోడ్ల బాగుకు  తట్ట మట్టి వేసిన దాఖలా లేదు. దీంతో రోడ్లలో అత్యధికం అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ప్రభుత్వం వీటి రూపురేఖలు ఆధునీకరించేందుకు గట్టిగా పూనుకుంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు తొలి విడతలో ప్రత్యేక మరమ్మతులకు రూ.196 కోట్లు కేటాయించింది. జూన్‌ నెలాంతానికి  పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో రోడ్లు, భవనాల శాఖాధికారులు రెండు నెలలుగా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. రెండు నెలల క్రితం మరమ్మతుకు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రాలేదు. తర్వాత టెండర్లను ఆహ్వానిస్తే జిల్లాలో 97 రహదారుల ఆధునీకరణకు కాంట్రాక్టర్లు ఉత్సాహంగా దాఖలు చేశారు. వర్షా కాలం రాకుండా పనులన్నింటినీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే నెల రోజులు ముందుగానే ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు గట్టి సంకల్పంతో కదులుతున్నారు. 

అమలాపురం–బొబ్బర్లకం రోడ్డుపై ప్రయాణమంటేనే వెనకడుగు వేసే పరిస్థితి. కోనసీమ జిల్లా వాసులకు రాజమహేంద్రవరం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై నిలువెత్తు గోతులుండేవి. వాహనం వెళ్లాలంటేనే గుండెలు జారిపోయేవి. అటువంటి అధ్వాన రహదారిపై రెండు నెలలుగా దృష్టి పెట్టి రూ.రూ.7.70 కోట్లతో ఆధునీకరించారు

మే నెలాఖరుకు  పూర్తి చేస్తాం 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 30 రోడ్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మే నెలాఖరు నాటికి అన్ని రోడ్లనూ ఆధునీకరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రోజూ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. 
– ఎ.హరిప్రసాద్‌బాబు,ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

గతుకుల  సమస్య తీరింది 
నిత్యం కాకినాడ వెళ్లేందుకు కొత్తూరు మీదుగా ప్రయాణించేవాళ్లం. యు.కొత్తపల్లి వెళ్లాలన్నా పండూరు నుంచి దగ్గర. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ రిపేర్లలో భాగంగా ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో రహదారుల ఇబ్బందులు తప్పాయి. క్షేమంగా రాకపోకలు సాగిస్తున్నాం.  
– వెల్లంకి భాస్కరరమేష్, పెనుమర్తి, కాకినాడరూరల్‌

ప్రయాణం సాఫీగా సాగుతోంది
చాలా ఏళ్ల నుంచి అమలాపురం–బొబ్బర్లంక రహదారి మరమ్మతులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా్నం. ఇప్పుడు కొత్తగా రహదారి ఆధునీకరణతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.   
– నందుల ఆదినారాయణ, పుల్లేటికుర్రు

మరిన్ని వార్తలు