నెల్లూరులో కుంభవృష్టి.. టెన్షన్‌ పెడుతున్న మరో మరో అల్పపీడనం

14 Nov, 2022 09:21 IST|Sakshi

ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. మూడు రోజులుగా సాధారణ స్థాయిలో కురిసిన వర్షం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. ప్రధానంగా జిల్లాలో  కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలంలోని పలు గ్రామాల్లో వీధుల్లో నడుము లోతు నీళ్లు చేరగా, నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు.. మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో వర్షాలు ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు.  

లోతట్టు ప్రాంతాలు జలమయం 
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌లోని అండర్‌ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జిని బ్యారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. మన్సూర్‌నగర్, మనుమసిద్ధినగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్‌ కాలనీ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. గాంధీబొమ్మ, రాయాజీవీధి, పొగతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు డ్రైయినేజీతో కలిసి ప్రవహిస్తోంది. కార్పొరేషన్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిలిచిన నీరు పోయేందుకు తాత్కాలిక అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.    

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు..
భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి సహాయక చర్యలు పొందవచ్చునని డీపీఓ ఎం ధనలక్ష్మి తెలిపారు. 

పోలీసు యంత్రాంగం అప్రమత్తం​
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తదితరశాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ సీహెచ్‌ విజయారావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో ప్రచారం చేయడంతో పాటు సముద్రం వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు లోతట్టు, శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అడ్డంకి ఏర్పడడంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. 

ఆదివారం నెల్లూరు నగరంలోని జయలలితానగర్, పొర్లుకట్ట, బోడిగాడితోట, అహ్మద్‌నగర్, మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంత పోలీసు అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే డయల్‌ 100 లేదా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9440796383కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు. బుచ్చి, కోవూరు, పొదలకూరు, కలువాయి. రాపూరు. వింజమూరు, అనంతసాగరం, గుడ్లూరు, కందుకూరు పోలీసులు వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో అటుగా రాకపోకలను నిషేధించారు.  

వర్షపాతం నమోదు..
అత్యధికంగా కావలి మండలంలో 227.5 మి.మీ., అత్యల్పంగా చేజర్ల మండలంలో 24.8 మి.మీ. వర్షం కురిసింది. జలదంకి మండలంలో 191.0, బోగోలు 154.8, లింగసముద్రం 150.2, ఉలవపాడు 149.4, నెల్లూరురూరల్‌ 141.2, గుడ్లూరు 137.8, వెంకటాచలం 137, కందుకూరు 134 విడవలూరు 124. ముత్తుకూరు 122.2, కొండాపురం 120.8, దగదర్తి 117.4, నెల్లూరు అర్బన్‌ 111.6, తోటపల్లి గూడూరు 109.8, కొడవలూరు 109.4, పొదలకూరు 107.2, మనుబోలు 104.2, కలిగిరి 99.2, ఉదయగిరి 99.0, బుచ్చిరెడ్డిపాళెం 98.6, అనుమసముద్రంపేట 95.0, సైదాపురం 94.6, అల్లూరు 92.2, ఇందుకూరుపేట 89.8, కోవూరు 86.6, వింజమూరు 86.4, ఆత్మకూరు 78.6, రాపూరు 66.8, అనంతసాగరం 61.8, మర్రిపాడు 61.4, వరికుంటపాడు 61.2, వలేటివారిపాళెం 58.0, దుత్తలూరు 57.6, కలువాయి 53.8, సీతారామపురం 50.0, సంగం 45.2 మి.మీ. వర్షం కురిసింది.      

మరిన్ని వార్తలు