Heavy Rains: రోడ్లకు వర్షాఘాతం

22 Nov, 2021 11:22 IST|Sakshi
తెగిపోయిన పాపాగ్ని హైలెవల్‌ వంతెన 

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1,500 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు

తక్షణ మరమ్మతులకు రూ.100 కోట్లు అవసరమని అంచనా

సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ జిల్లాల్లో దాదాపు 1,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనే దాదాపు 800 కి.మీ. మేర రోడ్లు దెబ్బతినగా...  నెల్లూరు జిల్లాల్లో దాదాపు 400కి.మీ., అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మరో 300 కి.మీ. మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా ఆ జిల్లాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూనే ఉంది.

వరద తగ్గితేగానీ ఎంతమేరకు రోడ్లు దెబ్బతిన్నాయన్నది కచ్చితంగా చెప్పలేమని ఆర్‌ అండ్‌ బీ అధికారులు అంటున్నారు. మరోవైపు దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.100 కోట్లు అవసరమని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్‌ అండ్‌ బీ అధికారుల బృందాలు ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

దెబ్బతిన్న హైవేలు 
మరోవైపు పలుచోట్ల జాతీయ రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం వద్ద పాపాగ్నిపై వంతెన కూలిపోయింది. 1977లో నిర్మించిన ఈ వంతెనపై ఉన్న ఏడు స్లాబుల్లో ఒకటి కూలిపోగా.. మిగిలిన ఆరు స్లాబులు కుంగిపోయాయి. దాంతో ఆ వంతెనకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతపురం నుంచి కడప వెళ్లే వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లిస్తున్నారు.

కూలిన వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దారమడుగు వద్ద జాతీయ రహదారి–16 తెగిపోయింది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి మార్గం ధ్వంసమైంది. పడుగుపాడువద్ద రహదారి కోతకు గురైంది. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో వాహనాలను తొట్టంబేడు వద్ద నిలిపివేసి.. కడప, పామూరు, దర్శి మీదుగా మళ్లిస్తున్నారు.

దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు తక్షణ మరమ్మతులు
వర్షాలకు గండ్లు పడిన గ్రామీణ రోడ్లను రూ.30.57 కోట్లతో తక్షణం మరమ్మతులు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈఎన్‌సీ సుబ్బారెడ్డి తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 241 రోడ్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయని ఇంజనీరింగ్‌ అధికారులు గుర్తించినట్టు ఆయన చెప్పారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 116 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లకు గండ్లు పడగా.. నెల్లూరు జిల్లాలో 72, అనంతపురం జిల్లాలో 53 రోడ్లకు గండ్లు పడినట్టు గుర్తించారు. మరో 772 గ్రామీణ రోడ్లు రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడినట్టు గుర్తించామన్నారు.

నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 463 రోడ్లు గుంతలు పడి దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 2,254 కి.మీ. గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నట్టు వివరించారు. 4 జిల్లాల్లో 9 చోట్ల ప్రభుత్వ భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు