ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అక్రమాల్లో టీడీపీ నేతల పాత్ర!

2 Dec, 2022 19:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలోని పలు ఆస్పత్రిల్లో ఈడీ సోదాలు చేస్తున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిల్లో ఈరోజు(శుక్రవారం) ప్రధానంగా సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అక్రమాల్లో ప్రముఖంగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్పత్రి నిర్మాణం కాకుండా రూ. 43 కోట్లు అక్రమ మార్గంలో దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాట రాజా.. సుదీర్ఘకాలం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేశారు.ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి నిధులు దారి మళ్లించేందుకు ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్‌ లిమిటెడ్‌ను ఉపయోగించుకున్నట్లు ఈదీకి ఆధారాలు లభించాయి.

మరొకవైపు ఈనాడు రామోజీరావు సమీప బంధువు అక్కినేని మణి చైర్మన్‌గా వ్యవహరించిన అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలోనూ చేసిన ఈడీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్పత్రికి డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిని విచారించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది.

మరిన్ని వార్తలు