స్వర్ణాల తీరం.. జనసంద్రం

12 Aug, 2022 17:38 IST|Sakshi

రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు

గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన గంధ మహోత్సవం

గంధం కోసం పోటీ పడిన భక్తులు

ఆరోగ్య రొట్టెకు ఫుల్‌ డిమాండ్‌

రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు. స్వర్ణాల తీరానికి వెళ్లే ప్రతి మార్గం గురువారం కిటకిటలాడింది. బారాషహీద్‌లను స్మరించుకుని కోర్కెలు తీరాలని చెరువులో ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. పండగకు అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు పర్యవేక్షించి ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. 

నెల్లూరు సిటీ: స్వర్ణాల తీరం జనసంద్రమైంది. గంధ మహోత్సవం తర్వాత రొట్టెల కోసం పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో దేశ, విదేశాల నుంచి గురువారం దర్గాకు అధికంగా వచ్చి బారాషహీద్‌లను దర్శించుకుని కోర్కెల రొట్టెలను స్వీకరించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన గంధ మహోత్సవం గురువారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ముఖ్య నాయకులు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
 
ఏర్పాట్ల పరిశీలన 
ప్రభుత్వ ఆదేశాల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఘాట్‌ నిర్వహణ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. పక్క జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. 

ఆరోగ్య రొట్టె ఉందా? 
ఈ ఏడాది ఆరోగ్య రొట్టెకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీనికోసం అనేకమంది వెతుకులాడారు. రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది వైరస్‌ బారినపడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రొట్టె కోసం డిమాండ్‌ ఏర్పడిందని చెబుతున్నారు. 

బందోబస్తును పరిశీలించిన ఎస్పీ
నెల్లూరు(క్రైమ్‌): రొట్టెల పండగ సందర్భంగా గురువారం బారాషహీద్‌ దర్గాకు ఎస్పీ సీహెచ్‌ విజయారావు విచ్చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. రొట్టెల మార్పిడి ప్రదేశంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, నిర్దేశిత ప్రదేశంలోనే రొట్టెలు మార్పిడి చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంధ మహోత్సవం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.   

తల్లిదండ్రులకు అప్పగింత
గురువారం దర్గా ఆవరణం భక్త జనసందోహంతో కిక్కిరిసింది. క్రైమ్‌ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఓ పాతనేరస్తుడిని అదుపులోకి తీసుకుని రూ.3 వేల నగదు, ఓ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి వాటిని అప్పగించారు. తప్పిపోయిన పదిమంది చిన్నారులను పోలీసులు సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏఎస్పీ (క్రైమ్స్‌) కె.చౌడేశ్వరి పర్యవేక్షణలో నగర ట్రాఫిక్‌ డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్, నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ పటిష్ట చర్యలు తీసుకున్నారు. 

మంటలు ఆర్పే పరికరాల ఏర్పాటు 
అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. దర్గా ప్రధాన ద్వారంతోపాటు దుకాణాల వద్ద మంటలను ఆర్పే సిలిండర్లు, పరికరాలను అందుబాటులో ఉంచారు. రొట్టెల మార్పిడి ప్రదేశం వద్ద ఫైర్‌ ఇంజిన్లు, మినీవాటర్‌ టెండర్లు, మిస్ట్‌ బుల్లెట్లు, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక« అధికారి కె.శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది దర్గా ఆవరణలో విధులు నిర్వహిస్తున్నారు.  

రొట్టెల కోసం.. 
నెల్లూరు(మినీబైపాస్‌): కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు స్వర్ణాల చెరువు వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరోగ్య, వ్యాపార, ధన, చదువు, గృహ తదితర రొట్టెలను తీసుకునేందుకు పోటీ పడ్డారు. 

ఇల్లు నిర్మించుకోవాలని.. 
చాలా సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మంచుకోవాలని కోరిక. పలువురు చెప్పడంతో ఇక్కడికి వచ్చి గృహ రొట్టె పట్టుకున్నా. జనాన్ని చూసిన తర్వాత ఇల్లు కట్టుకుంటామని నమ్మకం కుదిరింది.   
– లలిత, నెల్లూరు 

ఆరోగ్య రొట్టె పట్టుకున్నా 
ప్రతి సంవత్సరం రొట్టల పండగకు వస్తున్నా. పలురకాల రొట్టె పట్టుకున్నా. ఈ ఏడాది ఆరోగ్య రొట్టె పట్టుకున్నా. అందరూ బాగుండాలని ప్రార్థించా.  
– రసూల్, నెల్లూరు 

మరిన్ని వార్తలు