నాన్‌వెజ్‌ ప్రియులకు షాక్‌.. వంద కిలోల కుళ్లిన మాంసం

29 Aug, 2022 11:10 IST|Sakshi
కుళ్లిన మాంసాన్ని నిర్వీర్యం చేస్తున్న వీఎంసీ సిబ్బంది    

సాక్షి, విజయవాడ: వన్‌టౌన్‌ కొత్తపేట హనుమంతరావు చేపల మార్కెట్‌లో సుమారు వంద కిలోల కుళ్లిన మాంసాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వీర్యం చేశారు. చేపల మార్కెట్‌లోని పలు దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో నిల్వ ఉంచిన మంసాన్ని గుర్తించారు.

అందులో కుళ్లిన కోడిమాంసం, పొట్టేలు తలకాయ, చేపలను నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ.రవిచంద్, తన సిబ్బందితో కలసి దాడులు చేశారు. మార్కెట్‌లో ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, దానిపై బ్లీచింగ్‌ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేశారు. ఈ మాంసాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.

మాంసంలో పేగులను తొలగించి శుభ్రపరచి పొట్టలో ఐస్‌ వేసి విజయవాడ ఫిష్‌ మార్కెట్లో తీసుకొచ్చారని, ఇది పూర్తిగా కుళ్లి రంగు మారిందని నిర్ధారించారు. దీనిని విక్రయిస్తున్న దుకాణాలకు ప్రజారోగ్య చట్టం కింద నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ రవిచంద్‌ మాట్లాడుతూ.. నగరంలో ఎవరైనా నిల్వ చేసిన మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సూక్ష్మంగా పరిశీలన చేసిన తరువాతే మాంసం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. 

చదవండి: (ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు