మూడు రాజధానులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే..

25 Sep, 2022 16:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘జెండాలు లేకుండా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సంతోషం. పరిపాలన రాజధానిగా కావలసిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయి. రోడ్డు, రైల్వే, విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ ఉంది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని వద్దని చెప్పింది. నారాయణ కమిటీ మాత్రమే అమరావతి రాజధాని అని తెలిపింది. బోస్టన్, జీఎన్ రావు, పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. హైకోర్టును కర్నూలుకు తరలించి గుంటూరు, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్‌ జీఎస్ఎన్ రాజు  మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా అందరూ కోరుకుంటున్నారు. విశాఖ రాజధానిగా వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులు సమయం ఆసన్నమైంది’ అని వెల్లడించారు. 

29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం
పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలపై కవాతు చేయడానికి వస్తున్నారు. 29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రజలు 5 లక్షల ఎకరాలు అభివృద్ధి కోసం త్యాగం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగం కోసం ఎవరు మాట్లాడరు. అమరావతి రైతులకు కౌలు ఇస్తున్నారు.
-కొయ్య ప్రసాద్ రెడ్డి, ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు

హైదరాబాద్‌ తరహా అభివృద్ధికి విశాఖ మాత్రమే అనువైనది
ఉత్తరాంధ్ర రాజధాని విశాఖను పరిపాలన రాజధానిగా గుర్తిస్తే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. తక్కువ వ్యయంతో రాజధానిగా నిర్మాణానికి విశాఖ అనువైన ప్రదేశం. విశాఖ రాజధానిగా మారితే పెట్టుబడులు అన్ని రంగాల్లో వస్తాయి. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరగాలంటే విశాఖ మాత్రమే అనుకూలమైన ప్రదేశం.
-పైడా కృష్ణ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు

మరిన్ని వార్తలు