రెండోసారి కెమెరాకు చిక్కిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌

26 Aug, 2022 08:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు నెలల్లో రెండోసారి రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ (పెద్దపులి) అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆదివారం ఆవును చంపేసింది. ఆ కళేబరం వద్ద అటవీశాఖ అధికారులు నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. మిగిలిన కళేబరాన్ని తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి ఆ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన దృశ్యాలను కెమెరాలు చిత్రీకరించాయి.

ఆ చిత్రాల విశ్లేషణ కోసం గుంటూరులోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) శంబంగి వెంకటేష్‌ చెప్పారు. ప్రాథమిక పరిశీలన మేరకు అది మగ పులి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 4 నెలల కాలంలో కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఆనవాళ్లు కనిపించిన పులి ఇదేనని ఒక అంచనాకు వచ్చారు. 


మరో ఆవు హతం...
విజయనగరం జిల్లా బొబ్బిలి ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని బొబ్బిలి–బాడంగి మండలం సరిహద్దులోని హరిజన పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దాన్ని చంపేసి కళేబరాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మిగిలిన కళేబరాన్ని గురువారం ఉదయం గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆ ఆనవాళ్లను బట్టి ఉత్తర దిక్కుగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. (క్లిక్‌: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్‌)

మరిన్ని వార్తలు