కరువు సీమలో కరెంటు బస్సు

5 Aug, 2020 07:12 IST|Sakshi

అనుబంధ కంపెనీల ఏర్పాటుకు శ్రీకారం 

భూసేకరణ పూర్తి చేసిన అధికారులు

పనులు ప్రారంభించిన కంపెనీ ప్రతినిధులు

కరువు జిల్లా ‘అనంత’ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలక్ట్రికల్‌ బస్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు ‘వీర వాహన’తో ఒప్పందం చేసుకుంది. సోమందేపల్లి సమీపంలో అధికారులు ఇప్పటికే 124 ఎకరాలు సేకరించగా.. కంపెనీ ప్రతినిధులు పనులు ప్రారంభించారు. రూ.1000 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో 13 వేల ఉద్యోగాలు దక్కుతాయని భావిస్తున్నారు.  

సాక్షి, అనంతపురం ‌: ‘కియా’ కార్ల యూనిట్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘అనంత’లో మరో భారీ వాహనాల కంపెనీ ఏర్పాటు కాబోతోంది. కరువు జిల్లా ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను జిల్లాలో నెలకొల్పుతున్నారు. కియా మోటార్స్‌‌ తరహాలోనే జిల్లాలో ఎలక్ట్రిక్‌  బస్సుల యూనిట్‌ నెలకొల్పేందుకు వీర వాహన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని సైతం చేసుకుంది.  

రూ.1000 కోట్ల పెట్టుబడి 
వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1000 కోట్లతో జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఒప్పందాలు కూడా పూర్తి కాగా... జిల్లా అధికారులు సోమందేపల్లి మండల సమీపంలోని గుడిపల్లి గ్రామంలో 124 ఎకరాల భూమిని కేటాయించారు. ఏటా 3 వేల బస్సుల తయారీ లక్ష్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న  వీర వాహన్‌ కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూమిలో పనులను సైతం ప్రారంభించారు. వచ్చే రెండేళ్లలోపు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా అనుబంధ కంపెనీలు సైతం ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో భూములను కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. (7వ తేదీలోపు 17 వేల పోస్టుల భర్తీ)

13 వేల మందికి ఉపాధి 
వీర వాహన్‌ ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి... మొత్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మొన్న ‘కియా’...తాజాగా ‘వీర వాహన’ ఇలా అంతర్జాతీయంగా పేరుగాంచిన వాహనాల తయారీ సంస్థలు జిల్లాకు రావడంతో పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి  చెందే అవకాశం ఉంది.   

అగ్రిమెంట్‌ పూర్తి 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీర వాహన కంపెనీకి సోమందేపల్లి మండల సమీపంలో 124 ఎకరాల భూమిని కేటాయించాం. ఇప్పటికే సేల్‌ అగ్రిమెంట్‌ను సైతం పూర్తి చేశాం. కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం యూనిట్‌ను నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టారు. మరో రెండేళ్లలోపే యూనిట్‌లో బస్సుల తయారీ ప్రారంభమవుతుంది.  
– పద్మావతి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్, హిందూపురం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా