రాళ్లపాడుకు జలసిరులు

23 Jul, 2022 13:41 IST|Sakshi

ఎడమకాలువ రూ.27 కోట్ల కేటాయింపు

దశాబ్ద కాలంగా పెండింగ్‌ పనులకు సీఎం మోక్షం

వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీరు తరలింపు పనులకు నిధులు కేటాయిస్తూ  జీఓ జారీ

ఇప్పటికే సోమశిల ఉత్తరకాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటి కేటాయింపు

తాజా కేటాయింపులతో ఏడాది పొడవునా ప్రాజెక్టులో నీటి నిల్వఉండే అవకాశం

రైతులకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా అందనున్న నీరు

వర్షాధారిత ప్రాజెక్ట్‌గా మిగిలిన రాళ్లపాడుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలతో జలసిరులు పొంగనున్నాయి. 1.1 టీఎంసీల సామర్థ్యం కలిగిన రాళ్లపాడు ప్రాజెక్ట్‌ నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరు. ఈ ప్రాజెక్ట్‌ కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇప్పటికే సోమశిల జలాలను కేటాయించగా, తాజాగా వెలిగొండ నుంచి కూడా నీటి వాటాను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాళ్లపాడులో నిరంతరం జలకళ తాండవియనుంది.   

కందుకూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా):   రాళ్లపాడు ప్రాజెక్ట్‌.. రతనాల ప్రాజెక్ట్‌గా మారనుంది. కేవలం వర్షాధారితంగా నీటిని నింపుకునే ఈ ప్రాజెక్ట్‌కు ఇక నుంచి పుష్కలంగా నీటి వనరులు అందనున్నాయి. అటు పెన్నా, ఇటు కృష్ణా నది జలాలు తరలి రానున్నాయి. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు పెన్నానది జలాలు వస్తుండగా, భవిష్యత్‌లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. మరో పక్క రాళ్లపాడు ప్రాజెక్ట్‌ ఆయకట్టు పరిధిని పెంచేందుకు ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా నీరు అందనుంది.   

నీటి వనరులతో సస్యశ్యామలం 
రాళ్లపాడు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.1 టీఎంసీలు. అధికారిక, అనధికారిక ఆయకట్టు కలుపుకుని మొత్తం 25 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌ పరిధిలోని 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు దాదాపు 2.2 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. తాజా నిర్ణయంతో సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీల నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ కింద 20.14 కి.మీ. పొడవు ఉండే కుడి కాలువ పరిధిలో లింగసముద్రం, గుడ్లూరు, కొండాపురం మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 కి.మీ. పొడవు ఉండే ఎడమ కాలువ కింద లింగసముద్రం, వలేటివారిపాళెం మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా వర్షాధార ప్రాజెక్ట్‌ కావడంతో వర్షాలు పడి ప్రాజెక్ట్‌ నిండితేనే పంటలు పండుతాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో కేవలం రెండు, మూడు సార్లే పూర్తి స్థాయిలో పంటలు పండాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కేటాయించారు. 

1.17 టీఎంసీల వెలిగొండ జలాలు  
వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. నీటి కేటాయింపుతో పాటు కాలువ పనులకు రూ.6.14 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి రాళ్లపాడు వరకు మొత్తం 57 కి.మీ. దూరం ఉంది. కేవలం 4 కి.మీ. కాలువ తవ్వడం ద్వారా ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకు మళ్లించి అక్కడి నుంచి మన్నేరు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. త్వరలో టెండర్ల కేటాయించి, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.  

ఎడమ కాలువ పొడిగింపునకు  రూ.27 కోట్లు
రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టేందుకు రూ.27 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉన్న కాలువను 15.95 కి.మీ. మేర పొడిగించనున్నారు. తద్వారా కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 1,500 ఎకరాల నుంచి 4 వేల ఎకరాలకు పెరుగుతోంది. చీమలపెంట, శాఖవరం, వీఆర్‌ కోట, కలవళ్ల, నలదలపూరు గ్రామాల చెరువులకు నీరు అందుతోంది. వర్షాధారితంగా చేరే నీటితో పాటు అదనంగా సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీలు రావడంతో ప్రాజెక్ట్‌ పరిధిలో ఆయకట్టు 40 వేల ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా.    


ఎడమ కాలువ

మరిన్ని వార్తలు