వైద్యరంగ అభివృద్ధికి రూ.2,925 కోట్లు

8 Apr, 2021 03:09 IST|Sakshi

రూ.1,950 కోట్లతో 4 వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు

అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరుల్లో నిర్మాణం

రూ.975 కోట్లతో 4 కాలేజీలు, ఆస్పత్రుల ఆధునికీకరణ

పరిశీలనకు జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపిన ఏపీఎంఎస్‌ఐడీసీ

సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపమన్న ఏపీఎంఎస్‌ఐడీసీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి రూ.2,925 కోట్లతో కీలకమైన 8 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1950 కోట్లతో 4 వైద్య కళాశాలల నిర్మాణానికి, రూ.975 కోట్లతో 4 వైద్య కళాశాలలు, ఆస్పత్రుల ఆధునికీకరణకు ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయపరిశీలన కోసం జ్యుడిషియల్‌ ప్రివ్యూకి పంపింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుల్లో కొత్తగా వైద్య కళాశాలలను నిర్మించనున్నారు. ఏలూరు వైద్య కళాశాలకు రూ.525 కోట్లు, పాలకొల్లు, అమలాపురం, రాజమండ్రి వైద్య కళాశాలలకు రూ.475 కోట్ల వంతున వ్యయం అవుతుందని అంచనా వేశారు.

విజయవాడలోని సిదార్థ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని రూ.175 కోట్లతోను, గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్, ఫీవర్‌ హాస్పిటల్స్‌ను రూ.500 కోట్లతోను, ఒంగోలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్‌ను రూ.200 కోట్లతోను, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని రూ.100 కోట్లతోను ఆధునికీకరించనున్నారు. ఈ టెండర్లకు సంబంధించి మొత్తం డాక్యుమెంట్లు ఏపీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ, ఏపీఎంఎస్‌ఐడీసీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని, వీటిని పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు వారం రోజుల్లోగా తెలియజేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఒక ప్రకటనలో కోరింది. ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరుల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు