AP: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు

20 Aug, 2022 03:20 IST|Sakshi

నిధుల వినియోగంపై ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు జారీ 

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ఆర్థిక పరమైన పనులకు వినియోగం

ఒక్కో సచివాలయ పరిధిలో రూ.20 లక్షల విలువైన పనులు 

అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులే చేపట్టాలి

ఎమ్మెల్యే రెండు రోజుల పర్యటనలో పనులు, వాటిని చేపట్టే ఏజెన్సీ గుర్తింపు

తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, కల్వర్టులు, ఇతర సివిల్‌ పనులు..

కనీసం రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులకు అనుమతి

ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా 6 సచివాలయాలు సందర్శించాలి

ఈ నెల 18వ తేదీ వరకు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఆర్థిక పరమైన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,000.80 కోట్లు మంజూరు చేసింది. ‘గడప  గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానిక ప్రజలకు అవసరమైన, అత్యధిక ప్రభావం చూపే పనులను మంజూరు చేయడానికి ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి  20 లక్షల రూపాయల చొప్పున 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ.3,000.80 కోట్లు విడుదల చేసింది.

ఈ నిధులతో ఎలాంటి పనులు మంజూరు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులనే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కనిష్టంగా ఒక్కో సచివాలయ పరిధిలో రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులనే అనుమతించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో నోడల్‌ అధికారులుగా వ్యవహరించే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌లు పనులను గుర్తించాలని చెప్పింది. 

సచివాలయాల సందర్శన తప్పనిసరి
ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ప్రతి సచివాలయాన్ని 2 రోజుల పాటు సందర్శించాలి. ఎమ్మెల్యే సందర్శన షెడ్యూల్‌ను పది రోజుల ముందుగానే నోడల్‌ అధికారులకు తెలియజేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులు పాల్గొనాలి. 
సచివాలయ సందర్శన రెండు రోజుల్లో ఎమ్మెల్యేతో కూడిన అధికారుల బృందం అత్యధిక ప్రభావం చూపే పనులను గుర్తించాలి. ప్రజల వినతుల ఆధారంగా లేదా స్థానిక ప్రజల అవసరాల ఆధారంగా అత్యధిక  ప్రభావం చూపే పనులు గుర్తించాలి. పారిశుద్ధ్యం, నిర్వహణ, మరమ్మతులు వంటి సాధారణ పనులను సంబంధిత సచివాలయాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. ఆస్తుల కల్పనకు సంబంధించి గుర్తించిన అత్యధిక ప్రభావం చూపే పనులను నోడల్‌ బృందం తనిఖీ చేయాలి.
రెండో రోజు పర్యటన ముగిసేలోగా అత్యధిక ప్రభావం చూపే ఏ పనులు చేపట్టాలో ఖరారు చేయాలి. నోడల్‌ అధికారి మిగతా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రూ.20 లక్షల లోపు పనులను ఖరారు చేయడంతో పాటు తీర్మానం చేయాలి. నోడల్‌ అధికారి ఆ పనులకు ఏజెన్సీని కూడా గుర్తించి లైన్‌ ఎస్టిమేట్స్‌ కూడా పూర్తి చేయాలి.
ఖరారు చేసిన పనుల జాబితాను గడప గడపకు మన ప్రభుత్వం పోర్టల్‌లో నోడల్‌ అధికారి అప్‌లోడ్‌ చేయాలి. పనులకు సంబంధించిన తీర్మానం, లైన్‌ ఎస్టిమేట్‌ డాక్యుమెంట్‌తో పాటు సమస్య ఫొటోను నిర్ణీత ఫార్మెట్‌లో పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. మొత్తం ఈ పనుల ప్రక్రియను, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పర్యవేక్షిస్తుంది. 

చేపట్టాల్సిన పనులు ఇలా..
తాగునీటి సరఫరా పనులు: తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్మాణాల స్థాయి పెంపు, తాగు నీటి సరఫరా పైపు లైన్లు, ట్యాంక్‌లు.
రహదారుల పనులు: సిమెంట్‌ కాంక్రీట్‌ రహదారుల నిర్మాణం, సిమెంట్‌ కాంక్రీట్‌ రహదారుల స్థాయి పెంపు, తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల స్థాయి పెంపు.
డ్రైన్స్‌: ఓపెన్‌ డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి డ్రైన్స్‌ నిర్మాణం.
విద్యుత్‌: కొత్త ఎలక్ట్రికల్‌ లైన్, పోల్, కమ్యూనిటీకి అవసరమైన కొత్త డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.
కల్వర్టులు: కల్వర్టుల నిర్మాణం, కమ్యూనిటీ కోసం డ్రైనేజీలను దాటే నిర్మాణాలు.
ఇతర సివిల్‌ పనులు: కమ్యూనిటీ షెల్టర్‌ భవనాలు, కమ్యూనిటీ భవనాలకు ప్రహారీ గోడల నిర్మాణం, కమ్యూనిటీకి సంబంధించి వరద నివారణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాలు. 

3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన
ఈ ఏడాది మే 11వ తేదీన ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్శనలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం వారికి అందించిన పథకాల వివరాలను వివరించడంతో పాటు ఏమైనా సమస్యలుంటే అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా ఈ నెల 18వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు 3,055 గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన పూర్తి చేశారు. ఇప్పటి వరకు అత్యధిక ప్రభావం చూపే 4,174 పనులను గుర్తించారు.

మూడు కేటగిరీలుగా సమస్యల పరిష్కారం 
మంత్రులు, ఎమ్మెల్యేల గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా ప్రజల నుంచి వచ్చే వినతులను మూడు కేటగిరీలుగా..  పథకాలకు సంబంధించి, పథకేతరాలకు సంబంధించి, అత్యధిక ప్రభావం చూపే పనులుగా వర్గీకరించాం. వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. 
– అజయ్‌ జైన్, ప్రత్యేక సీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ
చదవండి: సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు!
  

మరిన్ని వార్తలు