నివర్‌ బాధితులకు రూ.500 ప్రత్యేక సాయం

6 Dec, 2020 04:12 IST|Sakshi

నాలుగు జిల్లాల్లో 49,123 మందికి మంజూరు

సాక్షి, అమరావతి: నివర్‌ తుపాను వల్ల పునరావాస శిబిరాల్లో గడిపిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) సహాయ ప్యాకేజీలకు అదనంగా రూ.500 ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. తుపాను వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించిన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఈ సాయం వర్తిస్తుంది. ట్రెజరీ రూల్‌ (టీఆర్‌)– 27 కింద వెంటనే వీరికి రూ.500 చొప్పున ప్రత్యేక సహాయం అందించాలని ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నాలుగు జిల్లాల్లో తుపాను సమయంలో భారీ వర్షాలతో సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారందరికీ నగదు ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ జిల్లాల్లో 49,123 మందికి రూ.500 ప్రత్యేక సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదించింది. వరదల్లో చనిపోయిన వారి వారసులకు ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపిన కలెక్టర్లు.. బాధితుల బ్యాంకు అకౌంట్, ఆధార్, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్లు పంపించాలని వారికి సూచించారు. ఇళ్లు కూలిపోయినవారికి సంబంధించిన ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్, వీధి, ఇంటి నంబర్‌ వివరాలను పంపించాలన్నారు.  

మరిన్ని వార్తలు