రోడ్ల అత్యవసర మరమ్మతులకు.. రూ.550 కోట్లు

31 Dec, 2020 04:38 IST|Sakshi

జనవరి 10లోగా టెండర్లు పూర్తి

45 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌తో యుద్ధప్రాతిపదికన పనులు

రూ.450 కోట్ల పెండింగ్‌ బిల్లుల మంజూరు

7 వేల కి.మీ మేర రోడ్ల పునరుద్ధరణకు చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లను కేటాయించింది. జనవరి 10లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరు నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖ లక్ష్యాలను నిర్దేశించుకుంది. కేటాయించిన నిధులతో చేపట్టే పనులకు సంబంధించి జిల్లాల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు 7 వేల కిలోమీలర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. వీటి కోసం ఏపీఆర్‌డీసీ (ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ప్రత్యేక నిధులు కేటాయించనుంది. గురువారం ఆర్‌ అండ్‌ బీ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించనున్నారు. 

రూ.450 కోట్ల పెండింగ్‌ బిల్లులు విడుదల 
గతంలో రోడ్ల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులను మంజూరు చేశారు. ఇందుకోసం రూ.450 కోట్లను ఇటీవలే విడుదల చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్ల మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, రూ.450 కోట్లను మంజూరు చేసింది.

అన్ని పనులూ మార్చి నాటికి పూర్తి 
రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి మార్చి నాటికి సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి అనుమతి రాగానే హై ట్రాఫిక్‌ కారిడార్ల రోడ్లను తీర్చిదిద్దుతాం. 
– ఎంటీ కృష్ణబాబు, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి   

మరిన్ని వార్తలు