కాలుష్య నియంత్రణకు రూ.639 కోట్లు  

27 Aug, 2021 05:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ, విశాఖతో పాటు 13 మునిసిపాల్టీల్లో స్వచ్ఛమైన గాలి, నీరు 

సీఐఐ సమావేశంలో పీసీబీ చైర్మన్‌ ఏకే పరీదా 

సాక్షి, అమరావతి/సత్యవేడు (చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.639 కోట్లు ఇవ్వనుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్‌ అశ్విన్‌కుమార్‌ పరీదా వెల్లడించారు. వీటిలో రూ.274 కోట్లు విశాఖపట్నానికి, రూ.232 కోట్లు విజయవాడకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ) ఏపీ చాప్టర్‌ ‘ఉత్తమ విధానాలు అనుసరించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి’ అనే అంశంపై గురువారం వర్చువల్‌ సదస్సును నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పరీదా మాట్లాడుతూ.. యువత, వివిధ సంఘాలు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ భారీఎత్తున పర్యావరణ అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు 13 జిల్లా కేంద్రాల్లో కాలుష్య నియంత్రణకు ఏపీపీసీబీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. 

ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు 
అలాగే, రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పరీదా చెప్పారు. తొలుత విజయవాడ, విశాఖ నగరాలతో పాటు మొత్తం 13 మునిసిపాల్టీల్లో స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ స్వచ్ఛ గాలి కార్యక్రమంలో స్థానిక సంస్థలతో పాటు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా కార్పొరేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. సదస్సులో శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న వివిధ పారిశ్రామికవాడల్లో నీటిని తిరిగి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో గ్రీన్‌ రేటింగ్స్‌ చాలా కీలకంగా మారనున్నాయన్నారు. ఫ్యాక్టరీల డైరెక్టర్‌ డి. చంద్రశేఖర్‌ వర్మ, ఎన్విరాన్‌మెంట్‌ ప్యానెల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వీవీఎస్‌ నారాయణరాజు, గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రదీప్‌ ధోబలే తదితర పరిశ్రమల ప్రతినిధులు కూడా మాట్లాడారు.    

మరిన్ని వార్తలు