Andhra Pradesh: మహిళా శక్తికి  ‘చేయూత’

9 Jan, 2023 04:38 IST|Sakshi

ఆసరా, చేయూత పథకాల తోడ్పాటుతో మార్ట్‌ల ఏర్పాటు

కాకినాడ జిల్లా మార్ట్‌లో 4 నెలల్లో రూ.74 లక్షల టర్నోవర్‌

అనకాపల్లి జిల్లా మార్ట్‌లో రోజుకు రూ.40 వేల విక్రయాలు 

ఇప్పటికే 14 మార్ట్‌లు ప్రారంభం.. ఈ నెలలోనే మరో తొమ్మిది మార్టులు

మార్చి కల్లా 500 మార్ట్‌లు ఏర్పాటే లక్ష్యం

పండుగల సీజన్లలో బంపర్‌ డ్రాలతో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు      

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథ­కాల సహకారంతో కాకినాడ జిల్లాలో మొద­లైన ఓ మహిళా మార్టు నాలుగు నెలల్లోనే రూ.74 లక్షల టర్నోవర్‌ను సాధించింది. గత డిసెం­బర్‌ 31న ఒక్క రోజులో రూ.2.5 లక్షల విలువైన సరుకులను విక్రయించి రికార్డు నెల­కొ­ల్పింది. నెల క్రితమే అనకా­పల్లి జిల్లాలో మొద­లైన మరో మహిళా మార్టు పది మందికి ఉపాధి కల్పిస్తూ ప్రస్తుతం నిత్యం రూ.40 వేల విలువైన సరుకులను విక్రయించే స్థాయికి వేగంగా ఎదిగింది. వైఎస్సార్‌ చేయూ­త, ఆసరా పథకాలతో సంఘటితమైన పొదుపు మహిళల వ్యాపార దక్షతకు ఈ రెండు జిల్లా­ల్లోని మార్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహంతో.. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల సభ్యులు సంఘటితమై నెలకొల్పిన చేయూత మహిళా మార్టులు కార్పొరేట్‌ కంపెనీల సూపర్‌ బజార్‌లకు పోటీగా విక్రయాలు నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 మార్టులు ఏర్పాటు కాగా రూ.లక్షల్లో విక్రయాలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా పథకాల ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయానికి పొదుపు సంఘాల మహిళలు మరికొంత జోడించి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయన్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు ఈ మార్టులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే సరఫరా చేస్తున్నాయి. 

ఖర్చుల నియంత్రణ.. బంపర్‌ డ్రాలు
చేయూత మహిళా మార్టుల నిర్వహణ ద్వారా పది మంది మహిళలు ఉపాధితోపాటు విక్రయాల ద్వారా వచ్చే లాభాలతో మెరుగైన జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్‌ 28వ తేదీ వరకు 14 మహిళా మార్ట్‌లు ఏర్పాటయ్యాయి. మరో 9 ఈ నెలలోనే ఏర్పాటు కానుండగా ఇంకా 11 చేయూత మహిళా మార్ట్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలో 500 చేయూత మహిళా మార్టుల  ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సూచించారు.

కనీసం 15 నుంచి 20 శాతం మార్జిన్‌తో ప్రముఖ కంపెనీల నుంచి ఉత్పత్తుల కొనుగోలుకు మార్టులను అనుసంధానించి డోర్‌ డెలివరీ, ఆన్‌లైన్, వాట్సాప్‌ బుకింగ్‌ సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్లను ఇంటివద్ద అందించేందుకు మార్టు సిబ్బందికి ఒక ద్విచక్ర వాహనం ఉండాలన్నారు. పండుగ సీజన్లలో బంపర్‌ డ్రాలతో వ్యాపారాలను ప్రోత్సహించాలని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నెలకు రూ.30 లక్షల టర్నోవర్‌ దిశగా కృషి చేయాలన్నారు. గ్రామీణ, మండల సమాఖ్య సభ్యులు పట్టణ ప్రాంతాల్లో మార్ట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

లాభాల బాటలో
మహిళా సంఘాల సభ్యులు 23 వేల మంది కలసి మార్టు ఏర్పాటు చేసుకున్నాం. నిత్యం 200 మంది సరుకులు కొనుగోలు చేస్తున్నారు. సుమారు 60 వేల కుటుంబాలకు తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందచేస్తున్నాం. గత ఏడాది డిసెంబర్‌ నాటికి రూ.74 లక్షల టర్నోవర్‌ సాధించి లాభాల బాటలో ఉన్నాం. డిసెంబరు 31వ తేదీన రూ.2.5 లక్షల సరుకులు విక్రయించి రాష్ట్రంలో అత్యధిక అమ్మకాలు జరిపిన మార్టుగా రికార్డు సృష్టించాం. తక్కువ ధరకు సరుకులు లభిస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం చేయూత, ఆసరా ద్వారా అందించిన సాయానికి మరికొంత జోడించి మార్టు ఏర్పాటు చేశాం.
– ఉప్పాడ ఎల్లేశ్వరి, చేయూత మహిళా మార్టు అధ్యక్షురాలు, యు.కొత్తపల్లి మండలం, –కాకినాడ జిల్లా  

పది మందికి ఉపాధి
నాణ్యమైన సరుకులను బయట మార్కెట్‌ కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. 1,500 సంఘాల ద్వారా సమకూరిన రూ.30 లక్షలకు తోడు ప్రభుత్వం అందించిన చేయూతతో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు చేతులమీదుగా నెల క్రితం మార్ట్‌  ప్రారంభించాం. ప్రస్తుతం రోజూ రూ.40 వేల మేర విక్రయాలు జరుగుతున్నాయి. పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఒక్కో సభ్యురాలు రూ.200 చొప్పున మూల ధన పెట్టుబడిగా పెట్టారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోకుండానే ఏర్పాటు చేశాం.
–అడపా అరుణ, చేయూత మహిళా మార్టు అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా మాడుగల మండలం 

ఈ నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తొమ్మిది మహిళా మార్ట్‌లు
–నెల్లూరు జిల్లా కందుకూరు
–విజయనగరం జిల్లా గరివిడి
–శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి
–ఏలూరు జిల్లా చింతలపూడి
–డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మడివరం
–బాపట్ల జిల్లా నిజాంపట్నం
–చిత్తూరు జిల్లా తవణంపల్లె
–నెల్లూరు జిల్లా వింజమూరు
–గుంటూరు జిల్లా ఫిరంగిపురం

ఏర్పాటు సన్నాహక ప్రక్రియలో ఉన్న 11 మహిళా మార్ట్‌లు
–పల్నాడు జిల్లా నాదెండ్ల
–పల్నాడు జిల్లా పిడుగురాళ్ల
–శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం
–విజయనగరం జిల్లా కోట
–ప్రకాశం జిల్లా సింగరాయకొండ
–బాపట్ల జిల్లా చీరాల
–విశాఖపట్టణం జిల్లా ఆనందపురం
–అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల
–పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం
–పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం
–నంద్యాల 

మరిన్ని వార్తలు