రాష్ట్రంలో మరో లక్ష కి.మీ. లక్ష్యం

5 Nov, 2020 04:21 IST|Sakshi

అంతర్గత రూట్లపై ఆర్టీసీ సర్వే

ప్రైవేటు ట్రావెల్స్‌కు దీటుగా సేవలందించేందుకు ప్రణాళిక

విజయవాడ–విశాఖ మధ్య సర్వీసులు పెంపు

రెండురోజులుగా తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ

తెలంగాణ భూభాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు

సాక్షి, అమరావతి: అంతర్‌రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్న అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే ప్రారంభించారు. అంతర్‌రాష్ట్ర సర్వీసుల్లో డిమాండ్‌ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు సర్వీసులు పెంచనున్నారు. దీన్లో భాగంగా విజయవాడ–విశాఖపట్టణం మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేషన్స్‌పై సర్వే చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. డిమాండ్‌ ఉన్న తిరుపతికి బస్సులు పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం –చెన్నైలకు సర్వీసుల పెంపుపై అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ వీటిని క్రమంగా పెంచనుంది. ఈ నెల రెండు నుంచి తెలంగాణకు ప్రారంభమైన బస్సుల్లో ఆక్యుపెన్సీ 80 శాతం వరకు ఉంది. విజయవాడ–హైదరాబాద్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ 45 సర్వీసులు నడిపితే, టీఎస్‌ఆర్టీసీ ఈ రూట్లో 39 సర్వీసులు నడిపింది. మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతర్‌రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ 65 శాతం ఉంది. తమిళనాడుకు త్వరలో సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ఆర్టీసీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే చెన్నైకి బస్సులు నడపనున్నారు.

విజయవాడ–విశాఖ మధ్య 107 సర్వీసులు
► విజయవాడ–విశాఖ మధ్య ఆర్టీసీ నిత్యం 107 సర్వీసులు నడుపుతోంది. అదే ప్రైవేటు ట్రావెల్స్‌ వారు 117 సర్వీసులు తిప్పుతున్నారు. 
► ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు పగటిపూట సైతం విజయవాడ నుంచి విశాఖకు బస్సులు నడుపుతున్నారు. అయితే కాంట్రాక్టు క్యారేజీలకు అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు.
► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ను కట్టడిచేయాలని ఆర్టీసీ ఇప్పటికే రవాణాశాఖకు లేఖ రాసింది.
► విజయవాడ–తిరుపతి రూట్‌లో ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు గతంలో నిర్వహించిన విధంగానే తిరుమల దర్శనసేవలను పునరుద్ధరించనుంది. 
► మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీకే ప్రజాదరణ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా అధికంగా ఉంది.

ఆదరణ ఉన్న అన్ని రూట్లు సర్వే చేస్తాం
ప్రయాణికుల ఆదరణ ఉన్న అన్ని రూట్లను సర్వే చేస్తాం. డిమాండ్‌ను బట్టి బస్సులు నడిపి ప్రైవేటుకు పోటీగా సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆర్టీసీలో ప్రమాదరేటు తక్కువ. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం.            
– బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌)   

మరిన్ని వార్తలు